– తనపై తానే హత్య ప్రయత్నం
– అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
నవతెలంగాణ-ఉప్పల్
ఓ బీజేపీ నేత సమాజంలో పలుకుబడి కోసం తన మీద తానే హత్య ప్రయత్నం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే చివరికి అసలు విషయం బయటపడటంతో అడ్డంగా బుక్కయ్యాడు. సంబంధిత కేసు వివరాలను మల్కాజిగిరి డీసీపీ పద్మజ ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్లో నివాసం ఉంటున్న భాస్కర్ గౌడ్.. సినీ నిర్మాతగా, బీజేపీ హిందీ ప్రచార కమిటీగా సుపరిచుతులు. కాగా, గన్మెన్లు వెంట ఉంటే సమాజం తనను గౌరవిస్తుందని.. తనకు ప్రాణహాని ఉన్నట్టు నమ్మిస్తే పోలీసులే తనకు గన్మెన్లను ఇస్తారని ప్లాన్ వేశాడు. ఈ మేరకు తన మీదే ఓ మర్డర్ ప్లాన్ చేయించుకున్నాడు. ఫిబ్రవరి 24వ తేదీన ఉప్పల్ భగాయత్‌లో ఈ మర్డర్ ప్లాన్ జరిగింది. అందుకోసం రూ.2,50,000 ఒప్పందం కూడా చేసుకున్నాడు. అనుకున్నట్టుగానే 24న ఉదరు భాస్కర్ గౌడ్.. తన శరీరంపై కత్తి పోట్లతో ఆస్పత్రికి చేరారు. అనంతరం తనపై హత్యా ప్రయత్నం జరిగిందని ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో అతను ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. హత్య ప్లాన్‌కు సహకరించిన భాస్కర్ గౌడ్‌తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. వీరివద్ద నుంచి ఇన్నోవా వాహనం, రెండు ద్విచక్ర వాహనాలు, రూ. 2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకో ఇద్దరు పరారీలో ఉన్నారు. భాస్కర్ గౌడ్‌పై జంట నగరాల్లోని పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే ఏడు కేసులు ఉన్నాయని డీసీపీ పద్మజ తెలిపారు.