బీజేపీ అంటే…. బ్రిటీష్‌ జనతా పార్టీ

– వారసత్వంగా విభజించు-పాలించు విధానం
– ఓటమి భయంతోనే రైతు రుణమాఫీ : రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ప్రస్తుత దేశాన్ని పాలిస్తున్నది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కాదు… బ్రిటీష్‌ జనతా పార్టీ అని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేారు. బ్రిటీష్‌ పాలకుల నుంచి వారసత్వంగా ‘విభజించు పాలించు’ అనే విధానాన్ని ఆ పార్టీ తీసుకుందని విమర్శించారు. విద్వేషాన్ని వీడాలని కోరుతూ భారత్‌ జోడో యాత్రతో రాహుల్‌ గాంధీ స్ఫూర్తి నింపారని గుర్తు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో ఆయన మాట్లాడారు. అంతకు ముందు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈసందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ మొదటి ప్రధాని నెహ్రూ నుంచి మన్మోహన్‌ వరకు 60 ఏండ్లలో చేసిన అప్పు కంటే ఎనిమిదేండ్లలో మోడీ రెండింతలు ఎక్కువగా అప్పులు చేశారని ఆరోపించారు. దేశం కోసం వీర వనిత ఇందిరా గాంధీ ప్రాణాలు అర్పిస్తే ఐటీ రంగం ద్వారా సాంకేతికంగా దేశాన్ని రాజీవ్‌ గాంధీ మరింత ముందుకు తీసుకెళ్లారని అన్నారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహరావు, మన్మోహన్‌ సింగ్‌ దేశాన్ని ఆర్థిక పురోగతివైపు నడిపించారని గుర్తు చేశారు. అందుకు భిన్నంగా దేశాన్ని బీజేపీ దివాళా తీయించిందని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు హామీ ఏమైందని ప్రశ్నించారు. ‘దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది.బీజేపీ వస్తే జీడీపీ పెరుగుతుందన్నారు. కానీ గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. మణిపూర్‌ మండుతుంటే మోడీ, అమిత్‌ షా కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారు.
మణిపూర్‌లో సైన్యాన్ని పంపి నిలువరించాల్సింది పోయి. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఈడీ, సీబీఐని పంపించారు. నియంతల కంటే నికృష్టంగా మోడీ వ్యవహరిస్తున్నారు’ అని విమర్శించారు. ఇండియా కూటమి ద్వారానే మళ్లీ దేశానికి మంచిరోజులు వస్తాయన్నారు. కాంగ్రెస్‌ హామీలు ఇస్తుంటే, సీఎం కేసీఆర్‌ అదే పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే ఆయన రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీని సీఎం నిర్వీర్యం చేశారని తెలిపారు. రాష్ట్రంలో గడిచిన తొమ్మిదేండ్లలో నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతున్నదంటే, అది కాంగ్రెస్‌ వల్లే…అయితే కేసీఆర్‌ ఏది చేసినా ప్రజలు నమ్మబోరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటామన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కేసీఆర్‌ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడిందని రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా ఆరోపించారు. 10వేల ఎకరాలు దోచుకున్నదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హడావుడిగా అమ్మిన భూములపై తాము అధికారంలోకి వచ్చాక సమీక్షిస్తామని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

Spread the love