బీజేపీ గుత్తాధిపత్య ధోరణిని ఎదిరించాలి

BJP should resist monopoly trend– హిందూత్వ దాడిని ప్రతిఘటించాలి
– లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సీపీఐ(ఎం) సమీక్ష
న్యూఢిల్లీ : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) పొలిట్‌బ్యూరో ఆదివారం న్యూఢిల్లీలో సమావేశమై లోక్‌సభ ఎన్నికలు, ఫలితాలపై సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
18వ లోక్‌సభ ఎన్నికలు
18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తమ రాజ్యాంగం, లౌకికవాద ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించుకునేందుకు భారత దేశ ప్రజలు ఈసారి బీజేపీకి మెజారిటీని దక్కనివ్వలేదు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన మెజారిటీ ఈసారి రాలేదు. 400కి పైగా సీట్లు రావాలంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన బీజేపీ ఈసారి 240సీట్ల దగ్గరే చతికిలబడిపోయింది. గత లోక్‌సభలో వున్న 303 సీట్ల కన్నా 63 తక్కువ. అంటే 20శాతం సీట్లు తగ్గాయి. బీజేపీకి స్వతంగా మెజారిటీకి 32సీట్లు తగ్గాయి. అయితే మిత్రపక్షాలు అదనంగా 52సీట్లను గెలుచుకోవడంతో ఎన్డీఏకు 292 సీట్లు వచ్చాయి. అంటే అవసరమైన మెజారిటీ కన్నా 20 అదనంగా వచ్చాయి.
ఇక ఇండియా బ్లాక్‌ పక్షాలన్నీ కలిసి 234సీట్లు గెలుచుకున్నాయి. మెజారిటీకి 38సీట్లు తగ్గాయి. భారత ఎన్నికల కమిషన్‌ అందచేసిన డేటా ప్రకారం పోలైన ఓట్లలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నింటికీ 43.31 శాతం ఓట్లు రాగా ఇండియా బ్లాక్‌ పక్షాలకు 41.69శాతం ఓట్లు వచ్చాయి. అంటే రెండు కూటములకు ఓట్ల తేడా రెండు శాతం కూడా లేదు.
ప్రతిపక్షాలపై విస్తృతంగా దాడులు, కేంద్ర దర్యాప్తు సంస్థలను దారుణంగా దుర్వినియోగం చేయడం, పెద్ద ఎత్తున ఆర్థిక బలగాన్ని ఉపయోగించడం వంటి నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు ముందుగా ఇద్దరు ముఖ్యమంత్రులు జైలుకెళ్ళారు. కాంగ్రెస్‌, సీపీఐ(ఎం) (కేరళలో ఒక జిల్లాలో) వంటి రాజకీయ పార్టీల బ్యాంక్‌ ఖాతాలు స్తంభింపచేశారు. ఎన్సీపీ, శివసేన వంటి ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకున్నారు. ధన బలాన్ని ఉపయోగించి, కేంద్ర దర్యాప్తు సంస్థలతో బెదిరించి వాటిని చీల్చారు. ప్రతిపక్షాలను చీల్చేందుకు అన్ని రకాల రాజకీయ ఎత్తుగడలకు బీజేపీ పాల్పడింది. ఎన్డీఏ కూటమిలోకి జేడీ(యూ)ను తిరిగి లాక్కోవడంలో విజయం సాధించింది.
ఎన్నికల కమిషన్‌ సక్రమంగా వ్యవహరించి వుంటే బీజేపీ, ఎన్డీఏలకు మరింత ప్రతికూల ఫలితాలు వచ్చి వుండేవి. బీజేపీ ఎజెండాను ముందుకు తీసుకెళ్ళడంలో ఎన్నికల కమిషన్‌ పాత్ర బాగా దోహదపడింది. మోడీ, పలువురు బీజేపీ నేతలు చేసే రెచ్చగొట్టే మతోన్మాద ప్రసంగాలను అదుపుచేయడానికి తిరస్కరించడంతో ఎన్నికల నిబంధనావళి అసంబద్ధంగా మారింది. పోలైన ఓట్ల డేటాను వెల్లడించడానికి తొలుత తిరస్కరించడంతో అవకతవకలు జరిగాయన్న అనుమానాలు తలెత్తాయి. ఇది, రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది.
కేవలం తన వైఖరిని, భావాలను ప్రచారం చేయడానికే మీడియాలో ప్రధాన భాగాలపై బీజేపీ పూర్తి పట్టును కలిగివుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అతిశయోక్తుల్లో ఈ విషయం బాగా స్పష్టమైంది. కార్పొరేట్‌ మీడియా భాగస్వామ్యంతో బీజేపీ పెద్ద మొత్తంలో వనరులు ఖర్చు పెట్టి సోషల్‌మీడియా ద్వారా తప్పుడు కథనాలు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసింది. ఓటింగ్‌ సరళిని ప్రభావితం చేసేందుకు పెద్ద మొత్తంలో ధన బలాన్ని ఉపయోగించింది. చాలాచోట్ల ఓటర్లకు నేరుగా వేల కోట్ల రూపాయిలను పంచిపెట్టారు.
నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం వంటి ప్రజల జీవనోపాధుల సమస్యలపై ఇండియా బ్లాక్‌ పక్షాలు దృష్టి పెట్టాయి. వీటితో పాటూ మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పౌర హక్కులకు ఎదురువుతున్న ముప్పులు, బెదిరింపులను ప్రముఖంగా తమ ప్రచారంలో ప్రస్తావించాయి. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు వారి జీవనోపాధులపై పెద్ద ఎత్తున నిర్వహించిన పోరాటాలు, ముఖ్యంగా రైతాంగ పోరాటాలు ఈ ఫలితాలకు గణనీయంగా దోహపడ్డాయి. మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ల్లో వ్యవసాయ ప్రాంరతాల్లో 38 సిట్టింగ్‌ స్థానాలను బిజెపి కోల్పోయింది. తమ జీవనోపాధులను మోడీ సర్కార్‌ ధ్వంసం చేయడంపై గ్రామీణ భారతం తీవ్రంగా ప్రతిస్పందించింది. మోడీ పదేండ్ల పాలనలో గ్రామీణ వాస్తవిక వేతనాలు పెరగకుండా స్తంభించిపోయాయి. దాదాపు 159 గ్రామీణ నియోజకవర్గాల ప్రజలు మార్పు కోసం ఓటు వేశారని అంచనా.
తను స్వంతంగా మెజారిటీ సాధించలేకపోయినా మోడీ గుత్తాధిపత్యాన్ని తిరిగి నెలకొల్పుకోవడానికి, మరింత బలోపేతం కావడానికి ప్రయత్నాలు సాగుతునే వున్నాయి. హిందూత్వ నిరంకుశవాద ధోరణులను, హిందూత్వ-కార్పొరేట్‌ సంబంధాలను బలోపేతం చేసే ప్రయత్నాల పట్ల ఇండియా బ్లాక్‌ పక్షాలు చాలా అప్రమత్తంగా వుంటూ వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఓడించాలి. లౌకిక ప్రజాస్వామ్యాన్ని, ప్రజల జీవనోపాధులను, ఆర్థిక సార్వభౌమాధికారాన్ని, సామాజిక న్యాయాన్ని, సమాఖ్యవాదాన్ని పరిరక్షించాలి. ఫాసిస్ట్‌ పద్దతులు ఉపయోగిస్తున్న హిందూత్వ నిరంకుశవాదానికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పోరాటాన్ని బలోపేతం చేయాలి. పార్లమెంట్‌ లోపల, వెలుపల ఇది జరగాలి.
వామపక్షాల పనితీరు
ఈ లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాలు కాస్త మెరుగుపడ్డాయి. సీపీఐ(ఎం) నాలుగు స్థానాలు, సీపీఐ రెండు, సీపీఎం(ఎంఎల్‌) రెండు స్థానాలు గెలుచుకున్నాయి. సీపీఐ(ఎం) పనితీరు పట్ల ముఖ్యంగా కేరళలో ఫలితాలపై పొలిట్‌బ్యూరో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయా రాష్ట్ర పార్టీ శాఖల సమీక్షల ప్రాతిపదికన పార్టీ కూలంకషంగా సమీక్ష జరుపుతుంది.
నీట్‌ పరీక్ష
నీట్‌ పరీక్ష నిర్వహణలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ పరీక్షల నిర్వహణా బాధ్యతలు చేపట్టింది. విద్యను ఉమ్మడి జాబితాలో మన రాజ్యాంగం పెట్టింది. కానీ విద్యను ఇలా కేంద్రీకృతం చేయడమనేది మన రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వాలను ఇలా పూర్తిగా పక్కనబెట్టడమనేది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. ఇటీవల నిర్వహించిన నీట్‌ పరీక్షకు సంబంధించిన అంశాల్లో సక్రమ దర్యాప్తు చేపట్టాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది.

Spread the love