Thursday, July 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనల్ల జాతీయులకు ప్రాణసంకటం

నల్ల జాతీయులకు ప్రాణసంకటం

- Advertisement -

మస్క్ కంపెనీ ఉద్గారాలతో దీర్ఘకాల వ్యాధులు
అనుమతి లేకుండా టర్బైన్ల ఏర్పాటు
వాషింగ్టన్ :
వ్యాపారవేత్త ఎలన్ మస్క్‌కు చెందిన కృత్రిమ మేథ కంపెనీ ఎక్స్ ఏఐ తన కొలోసన్ 2 డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం 59 సహజ వాయువు టర్బైన్లను ఏర్పాటు చేసింది. అయితే వీటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లీన్ ఎయిర్ అనుమతులు పొందలేదు. మస్క్ కంపెనీ ఏర్పాటు చేసిన టర్బైన్ల నుంచి పరిమితికి మించి ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఇవి ప్రధానంగా నల్ల జాతి ప్రజలు నివసించే ప్రాంతాలకు సమీపంలోనే విడుదల అవుతుండడం గమనార్హం. దీంతో ఈ ప్రాంతంలోని ప్రజలు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధ పడుతున్నారు. సాధారణంగా ఏఐ డేటా సెంటర్లు అధిక విద్యుత్‌ను డిమాండ్ చేస్తుంటాయి. దీనిని తట్టుకునేందుకు సంబంధిత కంపెనీలు ఆఫ్- గ్రిడ్ పవర్ ప్లాంటులను నిర్మిస్తున్నాయి. ఇవి ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి.

మిసిసిపీలోనే అత్యధికం
ఎలాంటి అనుమతులు పొందకుండా 27 టర్బైన్లను నడుపుతున్నామని, వీటికి అనుమతులు అవసరం లేదని మస్క్ కంపెనీ జనవరిలో వాదించింది. కానీ ఈ కంపెనీ ఏర్పాటు చేసిన టర్బైన్ల సంఖ్య 59. వీటిలో రెండు మినహా మిగిలివన్నీ డేటా సెంటర్ ఉన్న టెన్నెస్సీ రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని మిసిసిపీలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక ఆఫ్ – గ్రిడ్ విద్యుత్ ప్లాంట్లలో ఎక్స్‌ఏఐ టర్బైన్లే ఉన్నాయి. వీటి ఏర్పాటుకు పర్యావరణ అధ్యయనాలు, ప్రజాభిప్రాయ సేకరణలు జరపాల్సి ఉండగా వాటన్నింటినీ పక్కన పెట్టారు. కొన్ని వారాలు లేదా నెలల వ్యవధిలోనే అధికారుల నుంచి ఆనుమతులు లభిస్తుంటాయి.

న్యాయస్థానం ఎదుట భిన్న వాదనలు
టర్బైన్లు పరిమితికి మించి ఉద్గారాలను విడుదల చేస్తున్నాయని, కాబట్టి వాటి కార్యకలాపాలను నిలిపివేయాలని కోరుతూ పలు సంస్థలు ఏప్రిల్‌లో ఎక్స్‌ఏఐపై దావా వేశాయి. నల్ల జాతీయులు నివసించే ప్రాంతాలలో జనావాసాలు, పాఠశాలలు, చర్చిలు కాలుష్యానికి గురవుతున్నాయని తెలిపాయి. అయితే టర్బైన్లను నిషేధిస్తే జాతీయ భద్రతా ప్రయోజనాలకు ముప్పు కలుగుతుందని అమెరికా న్యాయ శాఖ వితండవాదం చేస్తోంది. ఎక్స్‌ఏఐ కంపెనీ వ్యవస్థలు అమెరికా సైనిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాల్సి ఉంది. టర్బైన్లు విడుదల చేస్తున్న ఉద్గారాల కారణంగా వచ్చే వాయు కాలుష్యం దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతోంది. జాతుల మధ్య అసమానతలు సృష్టిస్తోంది. చివరికి ప్రజల ఆయుర్దాయం కూడా తగ్గిపోతోంది.

ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి
30 టర్బైన్లు తమ సామర్ధ్యంలో 80 శాతం మేర పనిచేస్తే ఏడాదికి సుమారు రెండున్నర వేల షార్ట్ టన్నుల (షార్ట్ టన్ను అంటే సుమారు 907.18 కిలోల బరువుకు సమానమైన యూనిట్) నైట్రోజన్ ఆక్సైడ్‌ను, నాలుగు వేల షార్ట్ టన్నుల కార్బన్ మోనాక్సైడ్‌ను, 22 షార్ట్ టన్నుల ఫార్మాల్డిహైడ్‌ను విడుదల చేస్తాయి. నైట్రోజన్ ఆక్సైడ్‌తో శ్వాసకోస వాపు వస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ శరీరానికి ఆక్సిజన్‌ను అందకుండా చేస్తుంది. ఫార్మాల్డిహైడ్ అనేది క్యాన్సర్ కారకం.

డేటా సెంటర్లపై న్యూయార్క్ మారటోరియం
రాష్ట్రంలో అతి పెద్ద డేటా సెంటర్ నిర్మాణానికి న్యూయార్క్ రాష్ట్రం బ్రేక్ వేసింది. సంవత్సరం పాటు మారటోరియం విధించింది. ఏఐ కేంద్రాలకు భారీగా అవసరమైన సౌకర్యాలు, పెరుగుతున్న విద్యుత్ ఖర్చులు, నీటి కొరత, స్థానిక సమాజాలపై భారం వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని న్యూయార్క్ ఈ నిర్ణయం తీసుకుంది. డేటా సెంటర్లపై మారటోరియం విధించిన తొలి అమెరికా రాష్ట్రం న్యూయార్కే. ఏఐకి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై అమెరికాలో దేశవ్యాప్త చర్చ జరుగుతున్న తరుణంలో న్యూయార్క్ రాష్ట్రం ఈ నిర్ణయం తీసుకుంది. టెక్నాలజీ కంపెనీలు డేటా సెంటర్ల నిర్మాణానికి ఉరుకులు పరుగులు పెడుతుంటే అనేక రాష్ట్రాలలో ప్రజా ప్రతినిధులు, రెగ్యులేటర్లు మాత్రం వాటిని ఎలా నియంత్రించాలన్న విషయంపై చర్చోపచర్చలు జరుపుతున్నారు. విద్యుత్ గ్రిడ్లు, యుటిలిటీ బిల్లులు, స్థానిక సమాజాలపై వాటి పభావాన్ని విశ్లేషిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -