ప్రజ్వల్‌పై బ్లూ కార్నర్‌ నోటీసు జారీ

– హాసన సెక్స్‌ స్కాం కేసులో..
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికలవేళ హాసన సెక్స్‌ కుంభకోణం కన్నడ రాజకీయాలను కుదిపేస్తోంది. వందలాది మంది మహిళల్ని బెదిరించి అఘాయిత్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రజ్వల్‌ రేవణ్ణను స్వదేశానికి రప్పించేందుకు కర్నాటక సర్కారు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆయనపై బ్లూ కార్నర్‌ నోటీసు జారీ చేసినట్టు ఆ రాష్ట్ర హౌంమంత్రి పరమేశ్వర వెల్లడించారు. విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్‌ను గుర్తించి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇంటర్‌ పోల్‌ సాయం తీసుకొంటున్నామన్నారు.
బాధితులు 500 మంది పైనే?
ఆదివారం ఆయన బెంగళూరులో విలేకర్లతో మాట్లాడుతూ.. ఇప్పటికే నోటీసులు జారీ చేశారని.. ఇంటర్‌ పోల్‌ అన్ని దేశాలకు సమాచారం అందించి ప్రజ్వల్‌ రేవణ్ణ ఆచూకీ తెలుసుకుంటుందన్నారు. ప్రజ్వల్‌ను ఎలా తీసుకురావాలనే అంశంపై ఈ కేసులో విచారణకు ఏర్పాటు చేసిన సిట్‌ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి చెప్పారు. ఈ కేసులో సిట్‌ అధికారుల పనితీరును హౌంమంత్రి ప్రశంసించారు. తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సిట్‌ చర్యలు చేపడుతోందన్నారు. ఒక నేరానికి సంబంధించిన వ్యక్తిని గుర్తించేందుకు, అతడి కార్యకలాపాల గురించి దాని సభ్యదేశాల నుంచి అదనపు సమాచారం సేకరణకు అంతర్జాతీయ పోలీస్‌ సహకార సంస్థ బ్లూ కార్నర్‌ నోటీసు జారీ చేస్తుంటుంది.

Spread the love