త్రిపురలో రెండో విడతలోనూ రిగ్గింగ్‌ పలు చోట్ల ఓటర్లను బెదిరించారు

– పోలింగ్‌ ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకీడ్చేశారు
– ముందు రోజు రాత్రి ఇండ్లపై దాడులు, విధ్వంసం
– ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
అగర్తల : పశ్చిమ త్రిపుర లోక్‌సభ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఎన్నికల అక్రమాలు శుక్రవారం పోలింగ్‌ జరిగిన త్రిపుర తూర్పు (ఎస్‌టీ)లోనూ పునరావృతమయ్యాయి. ఎన్నికల సంఘం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన మోడల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో 15 బూత్‌లలో ఇండియా బ్లాక్‌కు చెందిన ఏజెంట్లను పాలక పార్టీ గూండాలు బయటకు ఈడ్చి, ఓటర్లను బెదిరించి వెనక్కి పంపేశారు. కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టంగా ఉండే మోడల్‌ బూత్‌లలో పరిస్థితే ఇలా ఉంటే ఇక సాధారణ పోలింగ్‌ బూత్‌లలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు కోవచ్చు. ఎన్నికల ప్రచారం ముగిసినప్పటి నుంచే బీజేపీ ఈ నియోజకవర్గంలో ఓటర్లను, పోలింగ్‌ ఏజెంట్లను బెదిరించే కార్యక్రమం చేపట్టింది. కొన్ని చోట్ల భౌతిక దాడులకు దిగింది. ఓటర్లను ఇంటి నుంచి బయటకు రాకుండా చేయాలని చూసింది. ఇండియా బ్లాక్‌ కార్యకర్తలు, పోలింగ్‌ ఏజెంట్ల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని లూటీలు, విధ్వంసానికి పాల్పడింది. కృష్ణాపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో పది ఇళ్లను బీజేపీ గూండాలు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. పోలింగ్‌ రోజున బీజేపీ దుండగులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ బైక్‌లపై స్వైర విహారం చేశారు. ఓటర్లలో విశ్వాసం నింపాల్సిన కేంద్ర బలగాలు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎక్కడా కానరాలేదు.. మొత్తం 71 మంది పోలింగ్‌ ఏజెంట్లను బీజేపీ దుండగులు దాడి చేసి బయటకు తరిమేశారని తెలియామురా సబ్‌ డివిజనల్‌ సీపీఐ(ఎం) కార్యదర్శి తెలిపారు. కుమార్‌ఘాట్‌లో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారే స్వయంగా ఎన్నికల అక్రమాలకు పాల్పడినట్టు ఫిర్యాదులొచ్చాయి. మోహన్‌పూర్‌, రిష్యముఖ్‌, ధరమ్‌కానగర్‌, కమలాపూర్‌, సుర్మా అసెంబ్లీ సెగ్మెంట్లలో గురువారం రాత్రి నుంచే బీజేపీ గూండాలు భయానక వాతావరణం సృష్టించారని ఇండియా బ్లాక్‌ నాయకులు తెలిపారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి, త్రిపుర లెఫ్ట్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ నారాయణ కర్మాకర్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి యుధిష్టిర్‌ దాస్‌, ఆర్‌ఎస్‌పి రాష్ట్ర కార్యదర్శి దీపక్‌ దేవ్‌, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకుడు జయంత్‌ దత్తా శుక్రవారం రాత్రి ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమ త్రిపురలో మాదిరిగానే తూర్పు త్రిపురలో పూర్తిగా రిగ్గింగ్‌ చేయాలని బీజేపీ శతవిధాలా యత్నించినప్పటికీ ఓటర్లు భయపడకుండా ఓటు వేయడం ఒక విజయమని అన్నారు. ముందు రోజు రాత్రి వీధి లైట్లు ఆర్పేసి బీజేపీ దుండగులు సృష్టించిన భయానక వాతావరణాన్ని చూస్తే ప్రజలు నిర్భయంగా ఓటు వేయగలరా అన్న అనుమానం కలిగిందని వారు అన్నారు. పశ్చిమ త్రిపురలో మాదిరి వందశాతానికి పైగా ఓట్లు పోలైన కేంద్రాలు ఇక్కడ పెద్దగా లేకపోవడం కొంతలో కొంత ఊరట. అయితే అంబాసోల్‌లో మాత్రం 112 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం తెలిపిన సమాచారం. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
త్రిపుర పశ్చిమ నియోజకవర్గంలో అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు
పశ్చిమ త్రిపురలో చాలా చోట్ల బూత్‌లను ఆక్రమించి, రిగ్గింగ్‌కు పాల్పడడంతో వంద శాతానికి పైగా ఓట్లు పోలైనవి ఓ అరడజను దాకా ఉన్నాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూసినప్పుడు మోహన్‌పూర్‌లో 109.09 శాతం, మజ్లిస్‌ పూర్‌్‌లో 105.30 శాతం, ఖాయర్‌పూర్‌లో 100.15 శాతం కయిర్‌ పూర్‌లో 98.80 శాతం ఓట్లు పోలయ్యాయి. భారీగా ఎన్నికల అక్రమాలు చోటు చేసుకున్న పశ్చిమ త్రిపురలో ఎన్నికలను నిలిపేసి తిరిగి స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరపాలని సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటీవల రెండు లేఖలు రాశారు. పశ్చిమ త్రిపుర లోక్‌సభ నియోజకవర్గంతో బాటు అదే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని రామ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో 109 శాతం ఓట్లు పోలవ్వడమనేది బూత్‌లను స్వాధీనం చేసుకున్నప్పుడు, వ్యవస్థీకృత పద్ధతిలో పూర్తిగా రిగ్గింగ్‌ చేసినప్పుడే సాధ్యమని అన్నారు. త్రిపురలో బీజేపీ నాయకులు ప్రతిపక్షాలపై విషం చిమ్ముతూ చేసిన వ్యాఖ్యలపై చర్య తీసుకోవాలని కోరుతూ ఆయన మరో లేఖ రాశారు. దీనికి ఎన్నికల సంఘం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు.

Spread the love