ప్రకృతి వనరుల దోపిడీ కోసమే గ్రీన్‌ క్రెడిట్‌ నిబంధనలు

– తక్షణమే ఉపసంహరించుకోవాలి : కేంద్రానికి వందలాది సంస్థలు, ప్రముఖుల లేఖ
న్యూఢిల్లీ : ప్రకృతి వనరుల దోపిడీకి సాధనంగా గ్రీన్‌ క్రెడిట్‌ నిబంధనలను, అందుకు అనుసరించే పద్దతులను రూపొందించారని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని వందమందికి పైగా పర్యావరణ, మానవ హక్కుల సంస్థలు, న్యాయవాదులు, ప్రముఖులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఈ నిబంధనలకు సంబంధించి గతేడాది ఫిబ్రవరి 24న నోటిఫికేషన్‌ ఇవ్వగా, తాజా నోటిఫికేషన్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి జారీ అయింది. గ్రీన్‌ క్రెడిట్‌ ఆదాయాల ద్వారా అటవీ మళ్లింపు చర్యలకు అందించే రాయితీలు వాస్తవానికి పర్యావరణాన్ని, అటవీ ప్రాంతాలను పణంగా పెడుతున్నాయని, అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల హక్కులను దెబ్బతీస్తున్నాయని ఆ లేఖ పేర్కొంది. వినూత్నమైన మార్కెట్‌ ఆధారిత యంత్రాంగంగా దీన్ని తెర మీదకు తీసుకువస్తున్నప్పటికీ, ఈ సహజ భూముల పరిరక్షణ, పునరుద్ధరణ, నిర్వహణల కోసం గ్రీన్‌ క్రెడిట్‌ నిబంధనలు మాత్రం అస్థిరమైన విధానాలతో మార్కెట్‌ శక్తులపై ఆధారపడతాయని ఆ లేఖ పేర్కొంది. వీటివల్ల వ్యాపార సంబంధిత కార్యకలాపాలు వేగవంతమవుతాయని, ఇవి పర్యావరణ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించేవని తెలిపింది. బాధిత కమ్యూనిటీలతో, నిపుణులతో విస్తృతంగా చర్చలు జరపకుండా ఇటువంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టరాదని కోరింది. పర్యావరణ పరిరక్షణకు హామీ కల్పిస్తూ చట్టబద్ధమైన యంత్రాంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో గ్రీన్‌ క్రెడిట్‌ ప్రోగ్రామ్‌ (జిసిపి) అనేది ప్రకృతి వనరుల దోపిడీకి మరో సాధనంగా మాత్రమే పనికి వస్తుందని ఆ లేఖ హెచ్చరించింది.
పీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్‌, లెట్‌ ఇండియా బ్రీత్‌, సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ అకౌంటబిలిటీ, ధాత్రి ట్రస్ట్‌ తదితర 101 సంస్థలు, పలువురు రచయితలు, జర్నలిస్టులు, న్యాయవాదులు సహా 431మంది ప్రముఖులు ఈ లేఖపై సంతకాలు చేశారు.

Spread the love