సీఆర్పీఎఫ్‌ డీఐజీపై వేటు!

సీఆర్పీఎఫ్‌ డీఐజీపై వేటు!– లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రక్రియ ప్రారంభించిన ఎంహెచ్‌ఏ
న్యూఢిల్లీ : సీఆర్పీఎఫ్‌ డీఐజీ ఖాజన్‌ సింగ్‌ విధుల నుంచి తొలగింపు వేటును ఎదుర్కొం టున్నారు. కేంద్ర పారామిలిటరీ దళంలో పనిచే స్తున్న మహిళలను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలపై హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఏ).. ఆయన సేవలను రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించింది. సీఆర్పీఎఫ్‌ మాజీ చీఫ్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ ఖాజన్‌ సింగ్‌.. క్రీడలలో ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డు గ్రహీత. ఈతగాడు అయిన ఆయన దక్షిణ కొరియాలోని సియోల్‌లో 1986 ఆసియాడ్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 1951 ఢిల్లీలో జరిగిన క్రీడల తర్వాత స్విమ్మింగ్‌లో దేశానికి మొదటి ఆసియా క్రీడల రజత పతకాన్ని సాధించాడు.వార్త కథనాల ప్రకారం.. లైంగిక వేధింపుల ఆరోపణలపై సీఆర్పీఎఫ్‌ విచారణలో అతను దోషి అని తేలిన తర్వాత, ప్రస్తుతం ముంబయిలో విధులు నిర్వర్తిస్తున్న సింగ్‌ను తొలగించాలని నోటీసులు కూడా అందాయి. సీఆర్పీఎఫ్‌ ప్రధాన కార్యాలయం అంతర్గత కమిటీ నివేదికను ఆమోదించింది. దానిని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) కి పంపింది. ఇది డీఐజీపై చర్యకు సిఫారసు చేస్తూ కేంద్ర హౌం మంత్రిత్వ శాఖకు నివేదికను పంపింది.కాగా, ఖాజన్‌ సింగ్‌కు ప్రతిస్పందించడానికి అవకాశం ఇచ్చారు. ఆయన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత(ఒకవేళ ఆయన పంపితే) 15 రోజులలోపు తుది ఉత్తర్వులు జారీ అవుతాయి. ఖాజన్‌ సింగ్‌ తనపై వచ్చిన ఆరోపణలను ఇప్పటికే ఖండించారు. ఇవి పూర్తిగా అబద్ధమనీ, నా ప్రతిష్టను దెబ్బతీయటానికే ఇలాంటివని ఆయన అన్నారు. కాగా, దేశంలో అతిపెద్ద పారామిలటరీ దళం అయిన సీఆర్పీఎఫ్‌లో 3.25 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం, ఇది మొత్తం 8000 మంది సిబ్బందితో మొత్తం ఆరు మహిళా బెటాలియన్‌లను కలిగి ఉంది. సీఆర్పీఎఫ్‌లో మహిళలు క్రీడలు, ఇతర పరిపాలనా విభాగాలలో కూడా నియమించబడ్డారు.

Spread the love