– మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
– మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీపీ
– సీతానగరం గ్రామంలో హృదయ విదారక ఘటనతో విషాద ఛాయలు
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
పిడుగు పడి ఓ బాలుడు మృతిచెందిన సంఘటన ఆళ్ళపల్లి మండలంలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సీతానగరం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ అంతరాయం సాయంత్రం వరకు ఉండటంతో ఉక్కపోత తట్టుకోలేక సేద తీరడానికి శివారులో ఉన్న పొలం గట్లపై ఉన్న ఓ మామిడి వట వృక్షం క్రింద మేకల సావిత్రి అనే వితంతువు ఇద్దరు మగ సంతానంలో చిన్న చిన్నవాడు, పుట్టుకతోనే చెవిటి, మూగ వాడైన మేకల సంతోష్ (13), గొగ్గెల శివ శంకర్, గొగ్గెల రంజీత్, గొగ్గెల శివ శంకర్ అనే నలుగురు ఆటలాడుకుంటూ ఉండగా వాతావరణంలో మార్పులు ఏర్పడి ఆకాశంలో ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. శివ శంకర్ అనే ఇద్దరు బాలురు చెట్టు కింద సేద తీరుతుండగా, సంతోష్ చరవాణిలో ఆటలాటుకుంటున్నాడు. అదే సమయంలో మూత్ర విసర్జనకై తోటి మిత్రుడు రంజీత్ చెట్టు పక్కకు వెళ్లి వచ్చే లోపు వట వృక్షం పై పిడుగు పడి మేకల సంతోష్ (13) మృతి చెందగా, మిగిలిన ఇద్దరు శివ శంకర్ లు గాయాలై స్పృహ కోల్పోయారు. ఘటనను గమనించిన రంజీత్ విషయం గ్రామస్తులకు చెప్పడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి వచ్చి చూడగా సంతోష్ విగతజీవిగా పడి ఉన్నాడు. మిగిలిన ఇద్దరు బాలురను కుటుంబ సభ్యులు ఆళ్ళపల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తీసుకెళ్లారు. గత ఏడాది ఆగస్టు నెలలో మేకల సావిత్రి భర్త మేకల విజరు మృతి చెందగా, ఆదివారం అల్లారుముద్దుగా పెంచుకున్న తన చిన్న కుమారుడు సంతోష్ సైతం మృతి చెందడంతో నుదుటి బొట్టును కోల్పోయి ఏడాది గడవక ముందే ఇంతలోనే కడుపు కోతతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే గ్రామస్తుల కంటి వెంట కళ్ళు చెమర్చాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి మృతుడి కుటుంబాన్ని, చికిత్స పొందుతున్న ఇద్దరు శివ శంకర్ లను పరామర్శించి, మనోధైర్యం కల్పించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల మృతి చెందిన వారికి ఇచ్చే ఆర్థిక సహాయం వెంటనే అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.