నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణంలోని 19వ వార్డులోని అంగన్వాడి సెంటర్లో సి.ఎం.ఎస్ దగ్గర తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడి టీచర్ విజయ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక 19వ వార్డు కౌన్సిలర్ కొయ్యడ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిపాల వారోత్సవాలు సమాజంలో ఎంతో ప్రాధాన్యత కలిగినవని, తల్లిపాలను తాగించడం ద్వారా శిశువుల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు తల్లిపాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
అలాగే అంగన్వాడి సెంటర్ల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం ఎంతో ఉపయోగకరమని, పాలు, గుడ్లు, బాలామృతం వంటి పోషకాహార పదార్థాలు గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు అందించడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ ఆహారాన్ని తప్పకుండా వినియోగించాలని ఆయన సూచించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలు అంగన్వాడి సెంటర్లలో అందించే పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుందని కౌన్సిలర్ కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ విజయతో పాటు తల్లులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



