రేవంత్ రెడ్డిపై, ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్

నవతెలంగాణ – హైదరాబాద్: రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, అలాగే బీఆర్ఎస్ పార్టీని కించపరిచేలా కాంగ్రెస్ ప్రకటనలు ఇస్తోందని, వీటిని వెంటనే నిలిపివేసేలా చూడాలని బీఆర్ఎస్ లీగల్ టీమ్ సోమవారం సీఈవో వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ప్రకటనలపై ఇదివరకే ఫిర్యాదు చేసిన అధికార పార్టీ తాజాగా మరోసారి చేసింది. ఈ మేరకు సీఈవోకు… లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ వినతిపత్రం అందించారు. కార్యకర్తల్ని రెచ్చగొడుతూ దుర్భాషాలాడుతున్న రేవంత్ రెడ్డిని ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించాలని బీఆర్ఎస్ లీగల్ టీమ్ కోరింది. ఈ సందర్భంగా సోమా భరత్ మాట్లాడుతూ… మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించకుండా కామెడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చంపేటలో గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. రేవంత్ రెడ్డిని ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించాలని ఈసీని కోరామన్నారు. నిషేధించిన ప్రకటనను బ్యాన్డ్ అని పెట్టి మరీ కాంగ్రెస్ నేతలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు.

Spread the love