ప్రజా సమస్యలపై జిల్లాల వారీగా కార్యాచరణ
గ్రామ స్థాయి నుంచి జిల్లా కమిటీల వరకు రద్దు
త్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమం
చీఫ్ మినిస్టర్ స్థాయిలో చీప్ మాటలు
ప్రాంతీయ పార్టీ స్థితికి పడిపోయిన కాంగ్రెస్
మాతో కలిసి నడిచిన సకల జనులకు ధన్యవాదాలు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలనను కొనసాగిస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. ప్రజా సమస్యలు, పాలనా వైఫల్యాలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించామని చెప్పారు. జిల్లాల వారీగా సమస్యలను గుర్తించి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ ముగింపును పురస్కరించుకుని ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గం, పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత అంశాలు, నిర్మాణంపై చర్చించారు. రాబోయే కాలంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకం, భూదోపిడీ, దందాలతోపాటు అభయహస్తం మ్యానిఫెస్టో పేరుతో ప్రజలకి ఇచ్చిన వాగ్ధానాలు అమలుకు నోచుకోకపోవడం వంటి అంశాలపై జిల్లాల వారీగా పోరాటాలకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ఇక నుంచి ఉధృతంగా ముందుకు పోవాలని చెప్పారు. హైదరాబాద్‌లో విద్యుత్, తాగునీరు, దోమల సమస్య తీవ్రంగా ఉందన్నారు. మూసీ పేరుతో ఇండ్లు కూలగొట్టారనీ, పేదలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజా సమస్యలను గుర్తించి పోరాటాలకు కార్యాచరణ ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమం చేపట్టేందుకు గల కారణాలు, ఉమ్మడి ఏపీలో వ్యవసాయం, విద్యుత్ కొరత, సాగునీటి స్థితిగతులు, ప్రజల ఇబ్బందుల గురించి కేసీఆర్ వివరించారని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ నాయకత్వంలో పాలన సాగిం దనీ, ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందించామని వివరించారు. రైతు బంధు వంటి గొప్ప పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. వ్యవసాయ రంగంలో తిరిగి సంక్షోభం వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కరెంటు కోతలు, ఆత్మహత్యలు, విత్తనాల కొరత, ఎరువుల కొరత, ధాన్యం కొనుగోళ్లు లేకపోవడంతోపాటు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు. వరి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలను ఆంక్షల్లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలకు ఖండన
పార్లమెంటులో ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీల నిష్క్రియా పరత్వం వల్ల నష్టం కలుగుతున్నదని అన్నారు. ఆయనకు ఫోన్ చేసి మాట్లాడింది తప్పు అని చెప్పాననీ, తర్వాత వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం వల్ల ఆ బిల్లు వీగిపోయిందని చెప్పారు. మహిళా లోకాన్ని బీజేపీ గందరగోళంలోకి నెట్టిందన్నారు. మహిళా రిజర్వేషన్ పట్ల బీఆర్‌ఎస్ చిత్తశుద్ధితో ఉందనీ, కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
సర్‌పై అప్రమత్తంగా ఉండాలి
సర్ విషయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ చెప్పారు. బీహార్, పశ్చిమబెంగాల్‌లో ఓట్ల తొలగింపు తర్వాత తాము ఈసీని కలిశామని అన్నారు. సర్ నిబంధనల్లో మార్పులు చేయాలని సూచించా మన్నారు. తెలంగాణలోనూ సర్ ప్రారంభమవుతుందని చెప్పారు. పార్టీ మొత్తం గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలనీ, ఓట్ల తొలగింపు దొంగ ఓట్ల నమోదుపై క్రియాశీలంగా పనిచేయాలని వివరించారు. జూబ్లీహిల్స్‌లో 15 వేల దొంగ ఓట్ల వల్ల ఓడ ిపోయామన్నారు. బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం 90 నియోజకవర్గాల్లో పూర్తయ్యిందన్నారు.
త్వరలో సభ్యత్వ నమోదు
పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీ కమిటీలపై చర్చించామని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ మినహా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అన్ని కమిటీలనూ రద్దు చేస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. ప్రతి నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలకు శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. త్వరలో షెడ్యూల్‌ను విడుదల చేస్తామని చెప్పారు. ప్రిసైడింగ్ అధికారులు, పరిశీలకుల నియామకం చేపడతామని వివరించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో మరో సమావేశం నిర్వహించి సభ్యత్వం నమోదు వివరాలను ప్రకటిస్తామన్నారు. సభ్యత్వ నమోదు పర్యవేక్షణకు నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను నియమిస్తామని అన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు క్రియాశీలంగా పనిచేయాలనీ, ప్రజల్లో ఉండాలని సూచించారు.
పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి
రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి అని కవిత పార్టీని ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. 25 ఏండ్లు పూర్తి చేసుకున్న ప్రాంతీయ పార్టీలు బీఆర్‌ఎస్, టీడీపీ మాత్రమేనని గుర్తు చేశారు. చీఫ్ మినిస్టర్ స్థాయిలో చీప్ మాటలు మాట్లాడితే బాగుండదని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ చతికిల పడి 12 ఏండ్లు అయ్యిందనీ, లేవలేక పోతున్నదనీ, ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయిందని చెప్పారు. రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రిగా గుర్తింపు సమస్య ఉందన్నారు. యాంకర్లు, యాక్టర్లు, ప్రతిపక్ష నేత గుర్తించడం లేదని అన్నారు. కేసీఆర్ గురించి చాలా మంది చాలా మాట్లాడతారనీ, వాటికి సమాధానం చెప్పే ఖాళీ సమయం తమకు లేదనీ, చాలా పనులు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జి జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, సునితా లక్ష్మారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజరు, విజయుడు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అరాచక పాలనపై బీఆర్‌ఎస్ పోరుబాట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



