నేత నర్సింలు గౌడ్
నవతెలంగాణ – నసురుల్లాబాద్
ఉద్యమ స్ఫూర్తితో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని నసురుల్లాబాద్ మండల పార్టీ సీనియర్ నాయకులు జి. నర్సింలు గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (ఎస్ఐఆర్)పై అవగాహన సమావేశానికి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి నసురుల్లాబాద్ మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
ఈ సందర్భంగా జి. నర్సింలు గౌడ్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారని, ప్రస్తుతం ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు మరోసారి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, రానున్న రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ఉద్యమ స్ఫూర్తితో చేపట్టి విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



