– కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం కొండా సురేఖ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అదేశాలమేరకు గాంధీభవన్‌లో ఎంపీ పసునూరి దయాకర్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించామన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది మారేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ వాళ్లను బెదిరించి రానివ్వకుండా చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ప్రజల అభీష్టంమేరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్‌లో సమస్య వొస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలో తెలియదన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యులందరికి అందుబాటులో ఉందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 100రోజుల్లో అమలు చేసిందన్నారు. పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం మంచి పరిణామమన్నారు.