బీజేపీ కోసం బీఆర్‌ఎస్‌ ఆత్మబలిదానం

BRS for BJP self-sacrifice– క్రాస్‌ఓటింగ్‌తోనే ఆపార్టీకి డిపాజిట్లు గల్లంతు
– కేసీఆర్‌ రాజకీయ జూదరి
– ఆయనకు కుట్రలు, కుతంత్రాలే తెలుసు
– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆత్మప్రభోదానుసారం నడుచుకోవాలి
– ఇది మాకు రెఫరెండమే..ప్రజల ఆశీర్వాదం దక్కింది
– అసెంబ్లీ ఎన్నికల కంటే ఓట్ల శాతం పెరిగింది
– రాహుల్‌గాంధీ పాదయాత్రతో దేశమంతటా మెరుగైన ఫలితాలు
– మోడీ గ్యారంటీలకు కాలం చెల్లింది..ఆయన తప్పుకోవాలి
– చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణస్వీకారానికి వెళ్తా : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి బీఆర్‌ఎస్‌ నాయకులు ఆత్మబలిదానం, అవయవదానం చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమ్‌ అని చెప్పామనీ, ఆ మాట మీద నిలబడి ఉన్నామని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్‌ షేరింగ్‌ పెరిగిందన్నారు. ఇచ్చిన మాట మేరకు వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలను అమలు చేయడంతో ప్రజలు 1.5 శాతం ఎక్కువ ఓట్లను వేసి ఆశీర్వదించారని తెలిపారు. 150 రోజుల పాదయాత్ర, ప్రజాస్వామిక వాదులను ఒక్కటి చేయడం, ఇండియా కూటమిని సమన్వయం చేసుకుని ముందుకు సాగడం లాంటి విషయాల్లో రాహుల్‌గాంధీ సక్సెస్‌ అయ్యారన్నారు. మోడీ గ్యారంటీకి కాలం చెల్లిందనీ, ఎన్డీఏ కూటమి నుంచి ఆయన తిరిగి ప్రధాని పదవి చేపట్టొద్దని హితవుపలికారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి 64 మంది ఎమ్మెల్యేలు, తమ మిత్రపక్షం సీపీఐ నుంచి ఒక ఎమ్మెల్యే గెలుపొందారనీ, అప్పుడు 39.5 శాతం ఓట్లు దక్కాయని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల్లో 41 శాతం ఓట్లతో 8 ఎంపీ సీట్లు గెలిచామనీ, ఆ రకంగా 1.5 శాతం మేర ఓట్లు పెరిగాయని చెప్పారు. అదే సమయంలో కొత్తగా కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకున్నామన్నారు. 2019లో మూడు ఎంపీలుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 8కి పెరిగిందని చెప్పారు. తమ ఎమ్మెల్యేలు గెలిచిన స్థానాల్లో ఈ ఎన్నికల్లోనూ మెజార్టీ దక్కిందని గుర్తుచేశారు. బీజేపీ గెలిచిన 8 పార్లమెంట్‌ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఏడు చోట్ల డిపాజిట్లను కోల్పోయిందనీ, అది క్రాస్‌ ఓటింగ్‌ వల్లనే జరిగిందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచీ తాను ఈ విషయాన్ని నొక్కి చెబుతూనే ఉన్నాననీ, ఫలితాల్లో అది స్పష్టంగా వెల్లడైందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఏర్పడినప్పటి నుంచి లోక్‌సభలో ఆ పార్టీ ఎంపీలు లేకపోవడం ఇదే తొలిసారన్నారు. హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థికి ప్రతిసారీ 30 వేల నుంచి నుంచి లక్ష ఓట్ల వరకు మెజార్టీ దక్కేదనీ, ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం అక్కడ బీఆర్‌ఎస్‌ లీడ్‌ కేవలం 2,500 మాత్రమేనని తెలిపారు. దీన్నిబట్టే బీజేపీకి ఎంత క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందో అర్థం చేసుకోవచ్చునన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 22 శాతం అధిక ఓట్లను దక్కించుకుని 8 ఎంపీ స్థానాలను దక్కించుకున్నదనీ, అదే సమయంలో బీఆర్‌ఎస్‌ 22 శాతం ఓట్లను కోల్పోయిందని వివరించారు.
బీఆర్‌ఎస్‌ తెలంగాణలో తాను చస్తూ బీజేపీని గెలిపించేందుకు కృషి చేసిందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలుంటే కేవలం కేటీఆర్‌, కేసీఆర్‌, హరీశ్‌రావు నియోజకవర్గాల్లోనే ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులకు మెజార్టీ వచ్చిందనీ, అదీ స్పల్పమేనని చెప్పారు. ఆ ముగ్గురూ ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ రాజకీయ అరాచకత్వాన్ని ప్రజాస్వామికవాదులు గమనించాలని కోరారు. బీజేపీని గెలిపించడానికి కేసీఆర్‌ ఆత్మార్పణం చేసుకున్నారనీ, చివరకు బూడిదే మిగిలిందని దెప్పిపొడిచారు. ఇప్పటికైనా వారు వ్యవహార శైలిని మార్చుకోవాలని సూచించారు. కుటుంబాన్ని, అక్రమాస్తులను కాపాడుకోవడానికి కేసీఆర్‌ చేస్తున్న పనులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇదే ధోరణి కొనసాగితే ఉనికి, మనుగడ లేకుండా బీఆర్‌ఎస్‌ కాలగర్భంలో కలిసిపోతుందని జోస్యం చెప్పారు. 2014లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పదిమంది కీలక నేతల ఫొటోలు పెట్టుకుని ప్రచారం చేస్తే 2024 వచ్చేసరికి ఏకవ్యక్తిస్వామ్యం పెరిగిందనీ, మోడీ గ్యారంటీ పేరుతో ఎన్నికలకు వెళ్లి బోర్లా పడ్డారని విమర్శించారు. మోడీ గ్యారెంటీని ప్రజలు తిరస్కరించడంతో ఆ పార్టీ ఎంపీల సంఖ్య 303 సీట్ల నుంచి 240కి పడిపోయిందన్నారు. ఇండియా, ఎన్డీయే కూటముల మధ్య ఓటు షేరింగ్‌లో ఒకశాతమే తేడా ఉందనీ, ఎన్డీయేకు పోటాపోటీగా సీట్లు సాధించామని తెలిపారు. ప్రజలు తిరస్కరించిన నేపథ్యంలో మోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టవద్దనీ, ఎన్డీయే కూటమి నుంచి ఎవరిరైనా ఎన్నుకుంటే మేలని చెప్పారు. వ్యక్తి పూజను మాని ప్రజాస్వామ్యయుతంగా ముందుకెళ్లాలని బీజేపీ నేతలకు సూచించారు. ఎంపీ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తామనీ, గెలుపోటములకు బాధ్యత తనదేనని నొక్కిచెప్పారు. కేసీఆర్‌ రాజకీయ జూదగాడనీ, అతను ఉన్నంత కాలం కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే ఉంటారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆత్మప్రభోదానుసారంగా నడుచుకోవాలని కోరారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను చీల్చి అధికారం చేపట్టామని భుజాలు తడుముకున్న బీజేపీకి తాజా ఎంపీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణలోనూ ఆ ప్రయత్నం చేసే అవకాశముందన్నారు.
చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే వెళ్తా : సీఎం
చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే వెళ్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇక నుంచి హైదరాబాద్‌ ఒక్క తెలంగాణకే రాజధాని అన్నారు. రాష్ట్ర విభజన సమస్యలు, మిగతా ఆస్తులు, నీటిపంపకాలు, తదితరాలను ఏపీ ప్రభుత్వంతో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరితోనైనా చర్చిస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై ఇప్పటికీ కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు
రాష్ట్రంలో ఇకపై ఏటా డిసెంబర్‌ తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ రోజు సచివాలయంతో పాటు అన్ని కార్యాలయాల్లోనూ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. డిసెంబర్‌ 9న తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. ఈసారి ఉత్సవాలకు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షులు సోనియాగాంధీని ఆహ్వానించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

Spread the love