– కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి కడతేర్చిన భార్య
– ఐదుగురిపై కేసు నమోదు.. రిమాండ్‌కు తరలింపు
– వివరాలు వెల్లడించిన డీఎస్పీ రమేష్ కుమార్
– 21 గంటల్లోనే కేసును చేధించిన పోలీసులు
– అభినందించిన జిల్లా ఎస్‌పీ రూపేష్
నవతెలంగాణ-జోగిపేట
వివాహేతర సంబంధానికి అడ్డు పడుతున్నాడని కట్టుకున్న భర్తనే.. ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించింది. అందోల్ డబుల్ బెడ్ రూం వద్ద కిడ్నాప్ చేసి.. కారులో ఎక్కించి హతమార్చిన నిందితులు.. మృత దేహాన్ని రామాయంపేట శివారులోని కోనాపూర్ చెరువులో పడేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను జోగిపేట పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ రమేష్ కుమార్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జోగిపేటకు చెందిన పాపన్నపేట మల్లేశంకు, అందోల్ మండలం మన్‌సాన్‌పల్లికి చెందిన కల్పనతో 2005లో వివాహం జరిగింది. మల్లేశం జోగిపేటలో ఇస్త్రీ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే కల్పనకు వివాహనికి ముందే మన్‌సాన్‌పల్లికి చెందిన మస్కూరి మహేష్‌తో వివాహేతర సంబంధంలో ఉన్నది. వివాహం తర్వాత కూడా ఆ బంధం అలాగే కొనసాగిస్తున్నది. ఈ విషయంపై మల్లేశం కుటుంబంలో తరుచూ గొడవలు జరుగుతుండేవి. దాంతో తన భర్తను ఎలాగైన అడ్డు తప్పించాలని భావించి.. ప్రియుడు మస్కూరి మహేష్‌కి వివరించింది. మస్కూరి మహేష్ రంగంపేటకు చెందిన తన మేనబావ ఉసికే అంబాజికి ఈ విషయాన్ని చెప్పగా.. గతంలో పాత నేరస్తుడుగా ఉన్న రంగంపేటకు చెందిన తలారి మహేష్‌తో పరిచయం చేయించి, రూ.50 వేలకు హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్సుగా రూ.5 వేలు ఇవ్వగా, పలుమార్లు మరో రూ.30 వేలను అందజేశాడు. అయితే ఇదే విషయాన్ని తన స్నేహితుడైన ఆటో డ్రైవర్ గంగారానికి చెందిన వజ్జరి మహేష్‌కు చెప్పడంతో అతను కూడా సహకరిస్తానని చెప్పాడు.
హత్య జరిగింది ఇలా…
వజ్జరి మహేష్ తన ఆటోలో మస్కూరి మహేష్‌తో కలిసి గురువారం రాత్రి జోగిపేటకు చేరుకుని ఆటోను బస్టాండ్‌లో పార్క్ చేశారు. జోగిపేట నుంచి టేక్మాల్‌కు వెళ్లి మస్కూరి మహేష్‌కు తెలిసిన వ్యక్తికి సంబంధించిన స్విప్ట్ కారును సెల్ఫ్ డ్రైవ్‌గా అద్దెకు తీసుకున్నారు. అక్కడి నుంచి కారులో రంగంపేటకు వెళ్లి.. మద్యాన్ని కొనుగొలు చేసి, తలారి మహేష్‌ను కారులో ఎక్కించుకుని జోగిపేటకు చేరుకున్నాడు. అక్కడ ఇండియన్ పెట్రోల్ పంపులో ఆ రాత్రి పడుకున్నారు. శుక్రవారం ఉదయం కల్పనకు ఫోన్‌చేసి నీ భర్తను చంపడానికి వచ్చాం.. అతడు బయటకు వచ్చే సమయాన్ని తెలియజేయాలని చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం 5:30 గంటల ప్రాంతంలో మల్లేశం బయటికి వెళ్లడంతో.. వెంటనే ఆ సమాచారాన్ని వారికి చెప్పింది. ఇంటి నుంచి బయటికి వచ్చిన మల్లేశం తలపై మస్కూరి మహేష్ బండరాయితో బలంగా కొట్టాడు. దాంతో అతడు స్పహ కొల్పోవడంతో, కారులో వేసుకుని సంగుపేట వైపు వెళ్లారు. ఈ క్రమంలోనే కారులో మల్లేశం చేతులను కట్టేసి, గొంతు నొక్కడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మతదేహాన్ని కారు డిక్కిలో వేసుకుని రామయంపేట శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రామాయంపేట సమీపంలోని కోనాపూర్ చెరువు వద్ద మతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయారు. అయితే శుక్రవారం ఉదయం మల్లేశం కిడ్నాప్‌కు గురయ్యాడని అతడి కుటుంబీకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. అయితే శనివారం కోనాపూర్ చెరువు దగ్గర మల్లేశం మృతదేహం లభ్యమైంది. ఈ క్రమంలో పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా 22 గంటల్లోనే కేసును చేధించడంతో సీఐ నాగరాజ్, ఎస్‌ఐలు అరుణ్‌కుమార్‌గౌడ్, క్రాంతి కుమార్, ఎస్‌ఐ-2 మొగులయ్య, ఎఎస్‌ఐ అంజయ్యతో పాటు సిబ్బందిని ఎస్పీ రూపేష్, డీఎస్‌పీ రమేష్ కుమార్‌లు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే నేరం ఒప్పుకొవడంతో మస్కూరి మహేష్, పాపన్నపేట కల్పన, తలారి మహేష్, వజ్జరి మహేష్, ఉసికే అంబాజీలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ ఆయన తెలిపారు.
అమ్మాయిలకు అవగాహన అవసరం
ఈ మధ్యకాలంలో జోగిపేట ప్రాంతంలో పోక్సో చట్టానికి సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని డీఎస్పీ రమేష్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా 16 నుంచి 18 ఏండ్లలోపు అమ్మాయిలకు అవగాహన రాహిత్యంతోనే ఈ కేసులు నమోదవుతున్నాయని తమ పరిశీలనలో తేలిందన్నారు. అమ్మాయిలు, తల్లిదండ్రులు దీనిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామన్నారు.