అన్నదాతపై అప్పుల భారం

అన్నదాతపై అప్పుల భారం– పెట్టుబడి రెండింతలు గిట్టుబాటు ధర కరువు
– రైతుకు చేయూతనివ్వని సంక్షేమ పథకాలు
– సంక్షోభంలో వ్యవసాయం రంగం
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పుడమికి పురుడు పోసి పుట్ల కొద్ది పంట తీసినా అన్నదాతకు పూట గడిచే పరిస్థితి లేదు. కుటంబం అంతా ఆరుగాలం కష్టపడినా బుక్కెడు మెతుకులు నోట్లోకి వెళ్లడం లేదు. దీనికి ప్రధాన కారణం అన్నదాతపై పడే ఆర్థిక భారం. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులు సాగు పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. నారు పోసింది మొదలు దుక్కులు దున్నడం నాట్లు, కోతల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించే వరకూ ప్రతిదీ డబ్బుతో కూడుకున్నవే. ఏటికేడు ఎరువులు, విత్తనాలు, పంట పెట్టుబడి రెండింతలు కావడం. పంట కోసం తెచ్చిన వడ్డీలు మీద పడడం. చివరికి పంట దిగుబడి సరిగ్గా రాకపోవడం.. వచ్చిన పంటకు గిట్టుబాటు లేకపోవడంతో రైతుకు అప్పులే మిగులుతున్నాయి. ఆ అప్పులు తీర్చే మార్గం లేక.. వడ్డీలు కడుతూ నెట్టుకొస్తున్నారు. దాంతో పాటు ప్రభుత్వాల విధానాలూ రైతుపై పెనుభారం మోవుతున్నాయి. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. రైతుకు ఏ మాత్రం చేయూతనివ్వడం లేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం ప్రత్యేకంగా చట్టం చేయడానికి పాలకులు చర్యలు తీసుకోవడం లేదు. ఒక్కోసారి వాతావరణంలో నెలకొన్న పరిస్థితులతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కూడా ప్రయత్నాలు ఆశించినంత ఉండవు. ప్రభుత్వాలు చొరవ తీసుకుని రైతుపై ఆర్థిక భారం తగ్గేలా ప్రత్యామ్నాయ చర్యలు అన్వేషించాలని రైతులు కోరుతున్నారు.
రాష్ట్రంలో 80 లక్షల మంది రైతులు సుమారు కోటి 60 లక్షల ఎకరాలల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలంలో రాష్ట్రంలో కోటి 56 లక్షల ఎకరాలు సాగు చేయనున్నట్టు వ్యవసాయ అధికారులు అంచనాలు వేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏడు లక్షల రైతు కుటుంబాలు పది లక్షల ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నాయి. ప్రతియేటా వ్యవసాయం రంగంలో సాగు ఖర్చులు రెట్టింపు అవడంతో రైతులకు సాగు భారం అవుతోంది. రసాయనిక ఎరువులతో నిండిపోయిన భూముల్లో పంట దిగుబడి తగ్గుతుండటంతో పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. దుక్కి దున్నినప్పటి నుంచి పంట విక్రయించే వరకు పెట్టుబడి తడిసి మోపెడవుతోంది. కానీ గిట్టుబాటు మాత్రం కావడం లేదు.
పెట్టుబడి రెండింతలు..
చమురు ధరలు పెరగడంతో దీని ప్రభావం ఎరువు, విత్తనాలు, ఇతర ఖర్చులపై పడుతోంది. 2021-22లో పొలం దుక్కి దున్నేందుకు గంటకు రూ. వెయ్యి ఉంది. ప్రస్తుతం గంటకు రూ.1500 అయింది. ఒక ఎకరం పొలం నాటు వేసే సమయానికి మూడు సార్లు దున్నాల్సి వస్తోంది. సుమారు 5 గంటలు పడుతుంది. ఈ లెక్కన కేవలం దుక్కి ఖర్చు రూ. 7500 అవుతుంది. నాటు ఖర్చులు గతంలో రూ. 3500 ఉంటే ప్రస్తుతం రూ. 5500లకు పెరిగాయి. వ్యవసాయ కూలీలకు గతంలో రూ. 350 నుంచి రూ. 750కి పెరిగింది. ఇలా అన్ని ఖర్చులు 30 నుంచి 40 శాతం పెరిగాయి. కానీ ధాన్యం రేటు మాత్రం గత కొన్నేండ్ల నుంచి పెరిగింది 3 శాతం మాత్రమే. దీంతో వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 30 వేల రూపాయలపైగా ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మత్తనగౌరెల్లిలో రైతు పంతు నాయక్‌కు నాలుగు ఎకరాల భూమి ఉంది. ఇందులో మూడు ఎకరాలు వరి సాగు. ఒక ఎకరం పాడి పశువుల మేత కోసం ఉపయోగిస్తున్నారు. ఇందుకు పెట్టుబడి ఎకరాకు రూ. 25వేల చొప్పున మూడు ఎకరాలకు గాను రూ.75 వేలు ఖర్చు వచ్చింది. మూడు ఎకరాల్లో వచ్చిన దిగుబడి 60 క్వింటాలు. ప్రభుత్వం నిర్ణయించిన మద్ధతు ధర రూ. 2203లకు విక్రయించగా 60క్వింటాల ధాన్యానికి రూ.1,32,180లు వచ్చాయి. పెట్టుబడి రూ. 75 వేలు పోనూ రైతుకు మిగిలినవి రూ.57,180. ఇది ఆ కుటుంబం ఆరు నెలల కష్టం. రూ. 57,180 రోజువారీగా చూసుకుంటే ఆ కుటుంబం వేతనం రూ.317గా ఉంది. చేవెళ్ల మండల పరిధిలోని మల్కపూర్‌ గ్రామానికి చెందిన రైతు చంద్రయ్య మూడు ఎకరాలు పత్తి సాగు చేశాడు. ఒక ఎకరం సాగుకు పెట్టుబడి సుమారు రూ.40 వేలు అయింది. అయితే ఎకరంలో వచ్చిన దిగుబడి మాత్రం 6 నుంచి 7 క్వింటాలు మాత్రమే. అంటే ఆ రైతుకు ఎకరాకు రూ.38 వేల ఆదాయం వచ్చింది. కనీసం పెట్టుబడి కూడా రాలేదు. మూడు ఎకరాల పత్తి సాగుకు రూ. లక్షా 20 వేలు ఖర్చు అయితే రైతులకు వచ్చిన ఆదాయం మాత్రం రూ. లక్షా 11వేలు మాత్రమే. దాదాపు రూ.9వేల నష్టం వచ్చింది. గతేడాది వర్షాలు కురవక పోవడం.. చేను పూతకు వచ్చే దశలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటకు చీడపీడలు సోకినా, ప్రకృతి ప్రకోపం చూపినా.. కొనుగోళ్లల్లో కొర్రీలు పెట్టిన.. ఆ ఏడు రైతులు తీవ్రంగా నష్టపోవడమే. సొంత పొలం సాగు చేసిన రైతులు పరిస్థితి ఇలా ఉంటే. ఇక కౌలు రైతుల పరిస్థితి వర్ణానాతీతం. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని పెట్టబడి తగ్గే మార్గాలు అన్వేషించాలని రైతులు కోరుతున్నారు.
ఏమీ పాయిదా లేదు.
మా ఇంటిల్లి పాది వ్యవసాయ మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. యాసంగిలో మూడు ఎకరాలు వరి వేస్తే.. రెండు ఎకరాలు ఎండిపోయింది. ఒక ఎకరంలో 20 బస్తాలు కూడా రాలేదు. యాసంగిలో రూ.లక్ష పెట్టుబడి మీద పడింది. గత వానాకాలం మూడు ఎకరాలు సాగు చేస్తే పెట్టుబడిపోగా రూ. 50 వేలు చేతికి వచ్చినా అందులో పెట్టుబడికి తెచ్చిన మిత్తిలు పోనూ మిగిలిందేమీ లేదు. వ్యవసాయం చేసే దాని కంటే కూలికెళ్లడమే నయంగా ఉంది. ఏమీ గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని పెట్టుబడి తగ్గేలా చర్యలు తీసుకోవాలి.
మహబూబ్‌నగర్‌లో 20 కేజీల వరి బస్తా వెయ్యి రూపాయలు
మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి : జిల్లాలో పత్తి తర్వాత అధికంగా వరి పంటను సాగు చేస్తారు. వరదలు వస్తే… ఇప్పటికే నారుమళ్లు వేసేవారు. మృగశిరలో నారుమల్లు వేస్తే… లాబదాయకమైన దిగుబడి వస్తుందని రైతుల నమ్మకం. వారం రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పత్తి విత్తనాలు సాగు చేశారు. వరి సాగుపై రైతులు దృష్టి సారించారు. ఎకరాకు వరి విత్తనాలు 20 కేజీలు అవసరం ఉంటుంది. గతంలో 20 కేజీల బస్తా విత్తనాలకు రూ. 900లకు అమ్మేవారు. ఈసారి ఒక బస్తా రూ. వెయ్యికి పెరిగింది. క్వింటాల్‌కు నాలుగు వందలకు పెంచి అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వ నియంత్రణ కొరవడటంతో వ్యాపారులు విత్తనాలను ఇష్టానుసారంగా అమ్ముతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో సహకార సంఘాల ద్వారా రాయితీ విత్తనాలు అమ్మేవారు. గత మూడేండ్లుగా సహకార సంఘాల నుండి పూర్తి స్థాయిలో విత్తనాలు సరఫరా చేయడం లేదు.
దీంతో డీలర్ల దగ్గర నుండి కొనుగోలు చేయడం తప్పని సరి అయ్యింది.పెరిగిన విత్తనాల ధరల వల్ల వరి సాగు కష్టంగా మారింది. ఒక్కోవిత్తన సంచికి రూ. 100 పెంచితే… సాగుకు భారం పెరిగి రైతులు అప్పుల్లో కూరుకపోయే అవకాశాలు ఉన్నాయి.
– తావునాయక్‌, రైతు మత్తన గౌరెల్లి
( మధ్యలో రెండు సార్లు యూరియా, నత్రజని, పొటాషియం చల్లుతుంటారు. దీనితో పాటు ఇతర ప్రకృతి వైెపరీత్యాలు, మరికొన్నిటికి కలుపుకుని 30 వేల రూపాయలు పైగా ఖర్చు కానున్నాయి. భూములను బట్టి కూడా ఖర్చు పెరిగే అవకాశం ఉంది.)

Spread the love