హానికరంగా పదేండ్ల బీజేపీ ట్రైలర్‌

CPI(M) politburo members BV Raghavu– మళ్లీ మోడీ గెలిచి.. సినిమా చూపిస్తే ఘోరమే
– తెలంగాణలో కమలంపార్టీకి ఒక్క సీటూ రానివ్వం
– 200 సీట్లు వచ్చే పరిస్థితి లేక ఆ పార్టీ ఆశలు సన్నగిల్లాయి
– కాళేశ్వరం అక్రమాల్లో కేంద్రానిది ప్రధాన పాత్ర
– ప్రజా సమస్యలు విస్మరిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమిస్తాం
– జాతీయ పార్టీ నిర్ణయం మేరకే భువనగిరిలో పోటీ : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
– విభజన హామీల అమలులో నిర్లక్ష్యం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పదేండ్ల బీజేపీ పాలన ట్రైలరే ఇట్లుంటే.. ఇక మళ్లీ గెలిస్తే సినిమా ప్రమాదకరంగా ఉంటుందని, దేశ ప్రజలకు భంగపాటు తప్పదని సీపీఐ(ఎం) పోలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. అందుకే తెలంగాణలో ఒక్క సీటు కూడా బీజేపీని గెలవనీయబోమని స్పష్టం చేశారు. తాము బలంగా ఉన్న భువనగిరి పార్లమెంటు స్థానంలో మాత్రమే పోటీ చేస్తున్నామని, ఇతర ప్రాంతాల్లో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌ను బలపరుస్తున్నట్టు తెలిపారు. భువనగిరి పార్లమెంట్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను గెలిపించాలని కోరుతూ ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలంలోని మంతన్‌గౌరెల్లిలో ప్రారంభమైన ప్రచారం.. మాల్‌, నల్లవెల్లి, చింతపట్ల, కొత్తపల్లి, నానక్‌ నగర్‌, నంది వనపర్తి, చిన్న తుండ్ల, ధర్మన్నగూడ గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌ షోల్లో రాఘవులు పాల్గొని మాట్లాడారు. అనంతరం ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనూ ఆయన మాట్లాడారు.
పదేండ్ల మోడీ పాలనలో దేశంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలను నడిపిస్తోందన్నారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం రాజ్యాంగం ప్రమాదంలోకి నెట్టబడుతుందని చెప్పారు తెలుగు రాష్ట్రాలకు విభజన హామీలను అమలు చేయలేదని, రాష్ట్రాల హక్కులను కాలరాసిందని, నీటిపారుదల రంగానికి సహాయం చేయలేదని విమర్శించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఉచితంగా రైతులకు ఇస్తున్న కరెంటుకు బదులు వ్యవసాయ బోర్లకు కేంద్ర ప్రభుత్వం మీటర్లను బిగించాలని విశ్వ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం నేడు నిరుపయోగంగా మారిందన్నారు.
అవినీతి చోటుచేసుకుందని సీపీఐ(ఎం) ముందు నుంచి హెచ్చరిస్తున్నా కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఈ అవినీతిలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. నిర్మాణానికి అనుమతులిచ్చిన సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ ఎందుకు పర్యవేక్షణ చేయలేదని నిలదీశారు. కులగణననూ అంగీకరించట్లేందని తెలిపారు. దళితుల వర్గీకరణ చేస్తామని చెప్పి మందకృష్ణ మాదిగను మోడీ తన బుట్టలో వేసుకున్నారని చెప్పారు. 254 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తామని మోడీ 2018లోనే చెప్పారన్నారు. పెట్టుబడిదారులకు రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం రైతాంగం పట్ల వివక్ష చూపుతోందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుంటామన్నారు. చట్టసభల్లో నిజమైన ప్రతిపక్షం అవసరమని, ఆ పాత్ర సీపీఐ(ఎం) పోషిస్తుందని చెప్పారు. మతోన్మాదం సృష్టిస్తూ, విభజన రాజకీయాలు చేస్తున్న మోడీకి ప్రస్తుతం భయం పట్టుకుందన్నారు. అందుకే బహిరంగంగా ప్రజల మధ్య వైషల్యాలు రెచ్చగొడుతున్నారన్నారు.
ఇలాంటి సమయంలో తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనీయబోమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సైతం పేదలపై నిర్బంధాలు ప్రయోగిస్తున్నదని తెలిపారు. జగిత్యాల మొదలుకొని మహబూబ్‌నగర్‌ వరకు నిల్వ నీడ కోసం ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇండ్లు వేసుకున్న గుడిసెలపై బుల్డోజర్లు పెట్టి ధ్వంసం చేసిందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై సీపీఐ(ఎం) ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై తన వాణిని, బాణిని వినిపించేందుకే భువనగిరి పార్లమెంటులో సీపీఐ(ఎం) పోటీ చేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, సీఐటీయూ జాతీయ నాయకులు సాయిబాబు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్‌, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌, రాష్ట్ర సీనియర్‌ నాయకులు పి.జంగారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుబ్బాక రామచందర్‌, కందుకూరి జగన్‌, పి.అంజయ్య, శ్రీనివాస్‌ రెడ్డి, శ్యాంసుందర్‌, సామెల్‌, జగదీష్‌, ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి సీహెచ్‌ జంగయ్య, యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ, ఆయా మండలాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love