తాళం వేసిన ఇంట్లో దోంగతనం..

– ఇస్లాంపుర కాలనీలో భారి చోరీ..
– 30 తులాల బంగారం, 35 తులాల వెండి 10 లక్షల నగదు అపహరణ
– ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ..
నవతెలంగాణ- డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్టేషన్ పరిధిలోని ఘన్పూర్ గ్రామపంచాయతీ పరిధి ఇస్లాంపూర కాలనీలో గురువారం అర్ధరాత్రి తాళం వేసిన ఇంట్లో దొంగతనం చోటు చేసుకుంది. ఇస్లాంపూర కాలనీలో నివాస ముంటున్న అమ్జాద్ హుస్సేన్ అతని భార్య గరీబున్నిసాబేగం కరీంనగర్లో ఉన్న అత్తమ్మ ఆరోగ్యం బాగా లేకపోవటంతో వారిని చూసేందుకు ఇటీవల కరీంనగర్ కు వెళ్లారు. వారి కుమారుడు అర్షద్, కుతురు అర్జిన్ ఫాతిమా వారి అక్క భవ ఉంటున్న ఇస్లాంపుర కాలనీలోని ఇంట్లో రాత్రి పడుకున్నారు. రాత్రి 2 గంటల సమయంలో తాళం వేసిన ఇల్లును గమనించిన గూర్తు తెలియని వ్యక్తులు అదే సమయంలో తాళాలు పగలగొట్టి బీరువాలో దాచి ఉంచిన 30 తులాల బంగారం, 35 తులాల వెండితో పాటు బీరువాలోని 10 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. ఉదయం 8 గంటల సమయంలో ఇంటికి వచ్చిన అర్జద్, అర్జిన్ ఫాతిమా ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్న విషయాన్ని గమనించి కరీంనగర్ లో ఉన్న తల్లి తండ్రులకు సమాచారమందించారు. దొంగతనం జరిగిన విషయాన్ని వేంటనే డిచ్ పల్లి పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి సీఐ కృష్ణ, ఎస్సై కచ్చకాయల గణేష్ లు చేరుకుని వివరాలు సేకరించారు.ఈ విషయాన్ని ఏసీపీ కిరణ్ కుమార్ కు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ చేరుకుని దొంగతనం జరిగిన తీరును, బాధితులను అడిగి తెలుసుకున్నారు. బీరువ, తలుపులపై ఉన్న దొంగల వేలిముద్రలను క్లూస్ టీం సిబ్బంది ని రప్పించి సేకరించారు. ఇంటికి ఎదురుగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దొంగల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి సేకరించారు.. రాత్రి 2 గంటల సమయంలో ఒక వ్యక్తి వెనుకకు బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ వచ్చి ఇంటి లోపలికి వెళ్లినట్లు సీసీ పుటేజీలో రికార్డైనట్లు గుర్తించారు. దొంగతనం జరిగిన తర్వాత ఆ వ్యక్తి అదే రోడ్డు వెంబడి వెళ్లిపోయినట్లు సీసీ పుటేజీలో కనబడుతుంది. దొంగిలించిన మొత్తం విలువ 30 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. కరీంనగర్లో ఉన్న బాధితులు ఇస్లాంపూరకు చేరుకుని డిచ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మూడు నెలల క్రితమే సౌదీ నుంచి ఇండియాకు వచ్చిన బాధితుడు
కొన్ని ఏళ్లుగా సౌదీ అరేబియాలో బ్రతుకు దెరువు నిమిత్తం వెళ్లిన అమ్జాద్ మూడు నెలల క్రితం వీసాను ఫినిష్ చేసుకుని ఇస్లాంపూరకు వచ్చాడు. ఇస్లాంపూరలో ఓ ఇంటిని కొనుగోలు చేసేందుకు 10లక్షల డబ్బులు సైతం పోగు చేసుకున్నాడు. వారం పదిహేను రోజుల తర్వాత ఇల్లును కొనుగోలు చేస్తామని అనుకున్న తరుణంలో దొంగలు నగలు, నగదును ఎత్తుకెళ్లటంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దొంగలను పట్టుకుని తమ బంగారు, నగదును రికవరీ చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు. మండల కేంద్రంలో ఇంత పెద్ద దొంగతనం జరగడంతో కాలనీవాసులు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి..
ఈసందర్భంగా ఏపీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తను నివాస గృహాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలతో దొంగతనాల నివారణకు అడ్డుకట్ట వేయవచ్చని సూచించారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నామని బాధితులకు హామీనిచ్చారు.
Spread the love