– కేంద్ర హౌంశాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. పలు ఫైళ్లు దగ్ధం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే వాటంతటవే దగ్ఘమయ్యాయా..లేక ఎవరైనా తగులబెట్టారా..అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతు న్నాయి.నార్త్ బ్లాక్‌లోని ఐసీ డివిజన్ లోని రెండో అంతస్తులో మంగళవారం ఉదయం 9:20 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని ఏడు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసినట్టు సీనియర్ డీఎఫ్‌ఎస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనలో జిరాక్స్ మెషిన్, కొన్ని కంప్యూటర్లు, పత్రాలు అగ్నికి ఆహుతైనట్టు వెల్లడించారు. ప్రమాద సమయంలో కేంద్ర హౌం మంత్రి అమిత్ షా భవనంలో లేరని, పలువురు సీనియర్ అదికారులు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని తెలిపారు. అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలే..అగ్గికి ఆజ్యం పోసి ఉండవచ్చని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.