నా ఫామ్‌ జట్టుకు భారంగా మారింది: బట్లర్

నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్ట్రేలియాతో గతరాత్రి అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆసీస్ చేతిలో చివరి వరకు పోరాడి ఓడిన డిఫెండింగ్ చాంపియన్స్‌ ఈ ప్రపంచకప్‌లో అత్యంత ఘోర పరాజయాలు చవిచూసింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లిష్ జట్టు కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ దారుణ పరాజయాలపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. తాను ఫామ్ కోల్పోవడం జట్టుకు చేటుచేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ టోర్నీలో బట్లర్ ఒక్క మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీ చేయలేకపోయాడు. అంతేకాదు, గత ఐదు మ్యాచుల్లో ఇంగ్లండ్ రెండుసార్లు మాత్రమే 200కుపైగా పరుగులు సాధించింది. నిన్న మ్యాచ్ అనంతరం బట్లర్ మాట్లాడుతూ.. తన సొంత ఫామ్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. టోర్నీకి రాకముందు చాలా గొప్పగా ఊహించుకున్నానని, కీలక పాత్రలో ఉండి కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. బ్యాట్‌తో తాను రాణించలేకపోవడం జట్టును దారుణంగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్నో అంచనాలతో భారత్‌కు వచ్చిన తాము నిరాశపరచడం తమను తీవ్రంగా బాధించిందని చెప్పుకొచ్చాడు. తమకు తాము న్యాయం చేసుకోలేకపోయామని పేర్కొన్నాడు. తమ జయాపజయాల్లో అండగా నిలిచి తమ భుజాలపై మోసిన సొంత దేశంలోని అభిమానుల ఆశలను దారుణంగా చిదిమేశామని విచారం వ్యక్తం చేశాడు. తాను తిరిగి ఫామ్‌లోకి రావడం, మ్యాచ్‌లు గెలవడం కోసం ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. 2022లో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ తాజా టోర్నీలో ఫేవరెట్లుగా బరిలోకి దిగింది. అయితే, జట్టు బ్యాటింగ్ ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది. ఫీల్డింగ్, బౌలింగ్ సరేసరి. ఇంగ్లండ్ తన తర్వాతి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది.

Spread the love