
శనివారం జిల్లాలో నిర్వహించిన గ్రూప్-4 రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగానే అభ్యర్థులు తమ తమ పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే అభ్యర్థులను క్షుణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రాలలోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాలలోకి హ్యాండ్ బ్యాగులు, పర్సులు, వాచ్ లు, స్మార్టు ఫోన్లు అనుమతించలేదు. షూ వేసుకుని వచ్చిన వారిని షూ బయటి విప్పిన తర్వాతనే లోనికి అనుమతించారు. పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రాల గేట్లను మూసి వేశారు. దీంతో పలు సెంటర్లలో అలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థులు వెనుదిరిగిపోయినట్లు తెలిసింది. 80 పరీక్షా కేంద్రాలలో 25,978 మంది అభ్యర్థులను కేటాయించారు. కాగా మొదటి పేపర్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 12.30 గంటల వరకు జరిగింది. మొదటి పేపర్ పరీక్షకు 21,838 మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. 4,140 మంది గైరాజరయ్యారు. రెండో పేపర్ మధ్యాహ్నాం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. రెండో పేపర్ కు సైతం 25,978 మంది హాజరు కావాల్సి ఉండగా 21 ,744 మంది హాజరు కాగా 4,234 మంది గైరాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 144 సెక్షన్ విధించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, చుట్టు పక్కల లౌడ్ స్పీకర్లు మూసి వేయించారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను వివిధ సెంటర్లకు ఏర్పాటు చేశారు. జిల్లాలో గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.