చీకటి కుహరం గా క్యాంపు కార్యాలయం ఏరియా

– అంధకారంలో హై సెక్యూరిటీ ఏరియా, తరుచూ ప్రమాదాలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజకవర్గం, మండల కేంద్రం అయిన అశ్వారావుపేట లో ఈ చిత్రాల్లో కనిపిస్తున్న అంధకారం అయిన దృశ్యాలు హై సెక్యూరిటీ ఏరియా. అశ్వారావుపేట – సత్తుపల్లి రోడ్. ఈ ప్రాంతంలో రహదారి ప్రక్కనే ఒక పక్క కెమిలాయిడ్స్ పరిశ్రమ, విద్యుత్ సబ్ స్టేషన్, అటవీ డివిజనల్ కార్యాలయం, వ్యవసాయ కళాశాల ఉంటాయి. మరో వైపు సామాజిక ఆరోగ్య కేంద్రం, పీఆర్ డివిజనల్ కార్యాలయం, అగ్ని మాపక‌ కేంద్రం, తహశీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, వీటిని అనుకుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఎస్.ఎం.హెచ్ బాలికల వసతి గృహం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇలా అనేకం ఉన్నాయి. అయినా ఈ రహదారికి ఇరువైపులా విద్యుత్ దీపాలు లేకపోవడంతో తరుచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది అగ్ని మాపక కేంద్రంలో జరిగిన ప్రమాదం లో పీఏసీఎస్ అద్యక్షులు నూతక్కి నాగేశ్వరరావు సైతం మృతి చెందారు. ఈ దారికి ఇరువైపులా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పరిసర ప్రాంతాల నివాసులు సంబంధిత అధికారులకు రెండువైపులా ఉన్న అశ్వారావుపేట,పేరాయిగూడెం పంచాయితీల పాలక వర్గాలకు మొర పెట్టుకున్నారు. అయినా పరిష్కారం కావడంలేదని స్థానికులు వాపోతున్నారు.ప్రస్తుతం ఎమ్మెల్యే ఆదినారాయణ దృష్టి సారించాలని, ఈ ప్రాంతం లో వెలుగులు నింపాలని స్థానికులు కోరుతున్నారు.

Spread the love