కూర్పు కుదిరేనా?

కూర్పు కుదిరేనా?– రోహిత్‌, ద్రవిడ్‌కు సరికొత్త సవాల్‌
–  కొత్త ముఖాలకు చాన్స్‌!
భారత్‌, ఇంగ్లాండ్‌ ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ రసవత్తర దశకు చేరుకుంది. రాజ్‌కోట్‌ వేదికగా రోహిత్‌, బెన్‌స్టోక్స్‌ సేనలు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమమయ్యాయి. రెండు టెస్టు అనంతరం 1-1తో ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. మూడో టెస్టులో విజయంతో సిరీస్‌లో ఆధిక్యంతో పాటు, ప్రత్యర్థిపై మానసికంగా పైచేయి సాధించేందుకు ఇరు జట్లు వ్యూహం రచిస్తున్నాయి. కీలక మూడో టెస్టు ముంగిట ఆతిథ్య భారత్‌ తుది జట్టు కూర్పుపై కుస్తీ పడుతోంది. తుది జట్టులో కనీసం ముగ్గురు నయా ఆటగాళ్లు చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది.
నవతెలంగాణ-రాజ్‌కోట్‌
వికెట్‌ కీపర్‌ సందిగ్దత
రిషబ్‌ పంత్‌ గాయంతో అందుబాటులో లేడు. ఇషాన్‌ కిషన్‌ను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవటం లేదు. దీంతో కె.ఎస్‌ భరత్‌ తొలి రెండు టెస్టుల్లో వికెట్‌ కీపింగ్‌ గ్లౌవ్స్‌ దక్కించుకున్నాడు. వికెట్ల వెనకాల ఫర్వాలేదు అనిపించిన భరత్‌.. బ్యాట్‌తో పూర్తిగా తేలిపోయాడు. రాజ్‌కోట్‌ టెస్టులో భరత్‌ స్ధానంలో ధ్రువ్‌ జురెల్‌కు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో జట్టు మేనేజ్‌మెంట్‌ ఉంది. రాజ్‌కోట్‌లో మంగళవారం స్లిప్స్‌ కార్డన్‌లో సర్ఫరాజ్‌, యశస్వి జైస్వాల్‌ తోడుగా జురెల్‌ వికెట్‌ కీపింగ్‌ సాధన చేశాడు. నెట్స్‌లో రెండు భిన్న సెషన్లలో బ్యాటింగ్‌ సాధన చేశాడు. భరత్‌ సైతం ఎక్కువసేపు బ్యాటింగ్‌ సాధన చేసినా.. ధ్రువ్‌ జురెల్‌ అరంగ్రేటం చేసే అవకాశం ఎక్కువగా ఉంది.
సర్ఫరాజ్‌కు అవకాశం!
శ్రేయస్‌ అయ్యర్‌పై సెలక్టర్లు వేటు వేశారు. కెఎల్‌ రాహుల్‌ మోకాలి నొప్పితో దూరమయ్యాడు. బ్యాటింగ్‌ లైనప్‌లో నం.4, నం.5 స్థానాలు ఖాళీ అయ్యాయి. రాహుల్‌ స్థానంలో విశాఖ టెస్టులో రజత్‌ పటీదార్‌ అరంగ్రేటం చేశాడు. ఇప్పుడు అయ్యర్‌ సైతం దూరం కావటంతో నం.4 స్థానంలో మరో ఆటగాడు అవసరం అయ్యాడు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం టెస్టు జట్టులో చోటు సాధించిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. తుది జట్టులో చోటును త్వరగానే దక్కించుకోనున్నాడు!. మంగళవారం బ్యాటింగ్‌ సెషన్లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు సర్ఫరాజ్‌ ఖాన్‌ సుదీర్ఘంగా సాధన చేశాడు. మరో యువ ఆటగాడు దేవదత్‌ పడిక్కల్‌ సైతం సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడు. కానీ, సర్ఫరాజ్‌ ఖాన్‌కు అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. మిడిల్‌ ఆర్డర్‌లో కీలక నం.4, నం.5 స్థానాల్లో ఇద్దరు కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగే సాహసం ద్రవిడ్‌, రోహిత్‌ చేయగలరా?ఆసక్తికరం.
మూడో స్పిన్నర్‌ ఎవరు?
ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకున్నాడు. సొంత మైదానం రాజ్‌కోట్‌లో మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్లో పాల్గొన్నాడు. బంతితో తక్కువ సమయమే సాధన చేసిన జడేజా.. ఎక్కువ సమయం బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కు కేటాయించాడు. రవీంద్ర జడేజా మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించినట్టు తెలుస్తోంది. దీంతో జడేజా, అశ్విన్‌లు స్పిన్‌ కోటాలో తుది జట్టులో నిలువనున్నారు. మూడో స్పిన్నర్‌ స్థానం కోసం అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ పోటీపడుతున్నారు. హైదరాబాద్‌ టెస్టులో అక్షర్‌ పటేల్‌ అవకాశం దక్కించుకున్నాడు. విశాఖలో జడేజా లేని వేళ పోటీ లేదు. మళ్లీ రాజ్‌కోట్‌లో అక్షర్‌, కుల్దీప్‌ రేసు మొదలైంది. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ స్పిన్‌కు అనుకూలించని పిచ్‌పై సైతం ప్రభావం చూపగలడు. జట్టుకు ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా నిలువగలడు. సంప్రదాయ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌కు భారత పిచ్‌లపై తిరుగులేని రికార్డుంది. అక్షర్‌ పటేల్‌ బ్యాటింగ్‌ నైపుణ్యం అతడికి అదనపు బలం.
బ్యాటింగ్‌ లైనప్‌లో మిడిల్‌ ఆర్డర్‌లో రెండు కీలక స్థానాలు, వికెట్‌ కీపర్‌ సహా మూడో స్పిన్నర్‌ అంశంలో జట్టు మేనేజ్‌మెంట్‌ కసరత్తు చేస్తోంది. రాజ్‌కోట్‌ పిచ్‌ హైదరాబాద్‌ తరహాలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. పిచ్‌, పరిస్థితులు, ప్రత్యర్థి బలాబలాలు సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది జట్టు కూర్పును ద్రవిడ్‌, రోహిత్‌ ద్వయం సిద్ధం చేయనున్నారు.
ముమ్మర సాధన
రాజ్‌కోట్‌ టెస్టుకు భారత్‌, ఇంగ్లాండ్‌ మంగళవారం ముమ్మర సాధన చేశాయి. శుభ్‌మన్‌ గిల్‌, దేవదత్‌ పడిక్కల్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, ఆకాశ్‌ దీప్‌ మినహా జట్టులోని 13 మంది ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో చెమటోడ్చారు. ఇంగ్లాండ్‌ క్రికెటర్లు సైతం రాజ్‌కోట్‌లో కఠోర సాధన చేశారు. రవీంద్ర జడేజా, ధ్రువ్‌ జురెల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌లు నెట్స్‌లో ఎక్కువ సమయం గడిపారు.

Spread the love