అన్ని శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో ముందస్తు జాగ్రత్తలు. తీసుకోవాలని, చిన్న చిన్న విషయాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలక్టరు హనుమంత్ కే.జెండగే ఆదేశించారు. గురువారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో మండల స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమీషనర్లు, వైద్య అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయితీ అధికారులు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, ఎ.ఎన్.ఎం లు, హెల్త్ సూపర్వైజర్లతో ఆయన సీజనల్ వ్యాధుల ముందస్తు జాగ్రత్తలపై సమీక్షిస్తూ…. మున్సిపాలిటీలు, గ్రామాలలో లోతట్టు ప్ర్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, గుంతలను పూడ్చాలని, బ్లీచింగ్, ఆయిల్ బాల్స్, ఫాగింగ్ ఏర్పాట్లతో దోమల నివారణకు కృషి చేయాలని, గ్రామాలలోని మంచినీటి ట్యాంకులను ప్రతి నెలా 1, 11, 21 తేదీలలో తప్పనిసరిగా క్లీనింగ్ చేసి క్లోరినేషన్ చేపట్టాలని, 7 రిజిష్టర్లను సక్రమంగా అమలుచేయాలని ఆదేశించారు. నిర్ణీత షెడ్యూలు ప్రకారం ఫాగింగ్ పనులు పకడ్బందీగా చేపట్టి దోమల నివారణకు కృషి చేయాలని తెలిపారు. దోమల నివారణకు ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని, టైర్లు, పూలకుండీలు, ఫ్రిడ్జిలు, కూలర్లు, కొబ్బరిబోండాలలో నీరు నిల్వ ఉండకుండా తీసివేసేలా ఇంటింటి అవగాహన కలిగించాలని తెలిపారు.
గ్రామాలలో పశువులు మేకలు, గొర్రెలకు ఏర్పాటు చేసిన నీటి తొట్టెలలో నీరు ఎక్కువ కాలం ఉండకుండా తీసివేయాలని గ్రామస్తులకు అవగాహన కలిగించాలని, నీరు ఎక్కువ కాలం నిల్వ ఉంటే దోమలు వృద్ది చెందుతాయని, డెంగ్యూ, మలేరియా వ్యాధులు వ్యాపిస్తాయని వివరించాలని, పిచ్చి మొక్కలు, గడ్డి మొక్కలను తొలగించాలని తెలిపారు. వసతి గృహాలలో, పాఠశాలల్లో వ్యాధుల గురించి అవగాహన కలిగించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, విద్యార్థులు అన్నం తినేపటప్పుడు తప్పనిసరిగా కాళ్లు చేతులు శుభ్రం చేసుకునేలా, వ్యక్తిగత పరిశుభ్రతపై జాగ్రత్తలు తెలుపాలని, వారికి అందించే భోజనం వేడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వసతి గృహాలు పాఠశాలలలో పరిసరాల పరిశుభ్రత ముఖ్యమని, పారిశుధ్య చర్యలపై జాగ్రత్తలు తీసుకోవాలని, మిషన్ భగీరధ మంచినీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వైద్య అధికారులు వసతి గృహాల పర్యవేక్షణలో విద్యార్థులకు సంబంధించిన సిక్ రిజిష్టర్లలో వైద్య వివరాలను పరిశీలించాలని, పిల్లల ఆరోగ్యం పట్ల వారికి ధైర్యం కలిగించాలని, ఆరోగ్యంపై పాటించే జాగ్రత్తలను విద్యార్ధులకు వివరించాలని అన్నారు. వర్షాల కారణంగా క్షేత్రస్థాయిలో అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో సీజనల్ వ్యాధుల అప్రమత్తత పట్ల కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని, జిల్లా పరిధిలో ఎక్కడైనా ఎపిడమిక్ సీజనల్ డిసీజ్ వచ్చినట్లయితే కంట్రోల్ రూమ్ కు తెలియజేసే విధంగా ఫోన్ నెంబర్లు గ్రామ పంచాయతీలలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో వుండాలని, స్టాక్ సరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
డెంగ్యూ కేసు నమోదైతే ర్యాపిడ్ యాక్షన్ టీముల సహాయంతో వైద్య సిబ్బంది ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని, అందరికి పరీక్షలు నిర్వహించి ప్రత్యేక వైద్య సహాయం అందించాలని తెలిపారు. సీరియస్ కేసు అయితే కమ్యూనిటీ హెల్త్ సెంటర్, జిల్లా ఆసుపత్రికి సకాలంలో పంపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యాధుల విషయంలో కంట్రోల్ రూమ్ కు సమాచారం అందగానే యుద్ధ ప్రాతిపదికన వైద్య బృందాలను పంపేలా చర్యలు తీసుకోవాలని, గత నాలుగైదు సంవత్సరాలలో వారి పరిధిలోని గ్రామాలలో ఎక్కువ జ్వరం కేసులు నమోదైన ఆ గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉపకేంద్రాలలో తగినంత మందుల నిల్వలు ఉండేలా చూడాలని, రాపిడ్ సర్వే లైన్స్ చేపట్టి అన్ని గ్రామాలలో సర్వే నిర్వహించాలని ఆదేశించారు. అతిసారా వ్యాధిపై నిఘా పెట్టాలని,త్రాగునీటి వనరుల వద్ద, గుంటలు, పైపుల లీకేజీ, ఓవర్ హెడ్ ట్యాంకులకు క్లోరినేషన్ వంటి చర్యలు సక్రమంగా జరిగేలా ఎం.పీ.డీ.వో లు శ్రద్ధ వహించాలని, వైద్యాధికారులు అన్ని స్థాయిలో తగిన మందులు నిల్వ ఉంచుకునేలా చూడాలని, వైద్య ఆరోగ్యశాఖ అన్ని శాఖలతో సమన్వయం ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, మహిళా శిశు సంక్షేమ శాఖ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, దోమలు నిలువ ఉండటానికి వీలు లేకుండా ఇంటి చుట్టుపక్కల నీటి నిల్వలు లేకుండా చూసేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రపంచ జనాభా దినోత్సవం …
జూలై 11వ న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని వైద్యులకు సూచించారు. అధిక జనాభా వలన కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించి చిన్న కుటుంబాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి గ్రామాలలో అవగాహన కల్పించాలన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఉత్తమ వైద్య సేవలు అందించిన వైద్యులకు, వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ మేమంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె గంగాధర్, జిల్లా పరిషత్ సిఇఓ శోభారాణి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పాపారావు, జిల్లా పంచాయితీ అధికారి సునంద, అధికారులు పాల్గొన్నారు.