ప్రజాస్వామ్యంలో ఇదేం పద్ధతి..రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే ఆవేదన
ఉత్తరాఖండ్‌లో ఖర్గే ప్రసంగించిన ప్రదేశంలో శుద్ధీకరణ
న్యూఢిల్లీ : బీజేపీ పాలనలో దళితులకు సరైన గౌరవం దక్కదని మరోసారి రుజువైంది. ఈ అనుభవం సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎదురైంది. రాజ్యసభ ప్రతిపక్ష నేత కూడా అయిన ఖర్గేకు ఉత్తరా ఖండ్‌లో తీవ్ర అవమానం జరిగింది. ఈనెల 8న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ లో ఖర్గే ఒక బహిరంగసభలో ప్రసంగించిన తర్వాత ఆ ప్రదేశం అపవిత్రమై పోయిందంటూ బీజేపీ అనుబంధ వర్గాలు శుద్ధి కార్యక్రమం నిర్వహించాయి. ఇది సోషల్ మీడియాతో పాటు ప్రధాన స్రవంతి మీడియాలోనూ వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటన తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. కాంగ్రెస్, బీజేపీల పరస్పర విమర్శలకు దారితీసింది. ఖర్గే ప్రసంగించిన ప్రాంతంలో బీజేపీతో కలిసి శ్రీరామ్ సేన శుద్ధీకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఘటనపై ఖర్గే గురువారం రాజ్యసభలో ఆవేదనతో ప్రసంగించారు. హల్ద్వానీలో ఒక బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత ఒక అంటరానితనం తాలుకు చేదు అనుభవాన్ని తాను చవిచూడాల్సి వచ్చిందని మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘దీనిని రాజకీయం చేద్దామని ఎప్పుడూ అనుకోలేదు.
చాలా ఏండ్లుగా నేను పార్లమెంట్లో ఉన్నాను. ప్రస్తుతం రాజ్యసభలో, గతంలో దిగువ సభలో సభ్యుడిగా ఉన్నాను. ఎప్పుడూ సానుభూతిని పొందడానికి ప్రయత్నించ లేదు. నాది షెడ్యూల్డ్ కులం, నేను దళితుడినని చెప్పి సహాయం, రక్షణ కల్పించా లని ఎన్నడూ అడుగ లేదు’’ అని ఆయన రాజ్యసభలో తెలిపారు. ‘‘హల్ద్వానీలో నేను ప్రసంగించినప్పుడు లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. నేను ఏ కులం, మతం పేరునూ ప్రస్తావించ లేదు. ప్రజల సమస్యలకు సంబంధించిన అంశా లను మాత్రమే ప్రస్తావించా. కానీ నా ప్రసంగం పూర్తయిన తర్వాత మీరు (బీజేపీ అనుబంధ సభ్యులు) శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి నన్ను అవమానించడానికి ప్రయత్నించారు. అస్పృశ్యత తాలుకు బాధను మీరు అనుభవం లోకి తెచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇదేం పద్ధతి? రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షిస్తారు? నేను ప్రతిపక్ష నాయకుడిని. పోరాటం చేసే శక్తి ఉంది. పోరాడుతాను’’ అని వివరించారు. వేదికను శుద్ధి చేసిన వారిపై అంటరానితనం చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, అలాంటి చర్యలను బీజేపీ ఎంతమాత్రమూ ప్రోత్సహించదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. దీనిపై దర్యాప్తు చేయిస్తామని ఆయన హామీనిచ్చారు.
స్థలం పవిత్రతను ఉల్లంఘించారు
సభాస్థలి శుద్ధి జరిగిన విషయాన్ని నిర్వాహకులు అంగీకరించారు. అక్కడో రాజకీయ సభ జరిగిందని, సభా నిర్వాహకులు చేసిన కొన్ని అభ్యంతరకర నినా దాలు ఎట్టి పరిస్థితుల్లో జరగరాదన్న లక్ష్యంతోనే అక్కడ శుద్ధీకరణ చేసినట్టు ఆ కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరు తెలిపారు. ఘటనపై ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ గణేశ్ గొడియాల్ మాట్లాడుతూ బీజేపీతో కలిసి శ్రీరామ్ సేన శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిందని ఆరోపించారు. ఈ ఘటనను ఆర్జేడీ ఇతర పార్టీలు ఖండించాయి. ఈ దురదృష్టకర ఘటనను ప్రధాని ఖండించాలని కాంగ్రెస్ నేత సల్మాన్ సోజ్ కోరారు.
ఘటనతో మాకు సంబంధం లేదు : బీజేపీ
శుద్ధి కార్యక్రమంతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని బీజేపీ ఖండించింది. ఘటనను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ తమపై ఆరోపణలు చేస్తున్నదని, ఇదొక విభజన వ్యూహమని ఉత్తరాఖండ్ బీజేపీ మంత్రి ఖాజన్ దాస్ అన్నారు. దళితులను తాము అవమానించ లేదని, అది మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నదని తెలిపారు.



