ఘనంగా బెల్లి లలితక్క 25వ వర్ధంతి వేడుకలు 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
తెలంగాణ గాన కోకిల, మలిదశ తెలంగాణ ఉద్యమ అమరురాలు గద్దర్ బెల్లి లలితక్క 25వ వర్ధంతిని ఆదివారం  హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో జేఏసీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ మలి దశ తెలంగాణ ఉద్యమం లో ప్రజలను చైతన్యం పరిచిందన్నారు. తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులు బెల్లి లలితక్క ను 17ముక్కలు చేసి గోనె సంచులలో కట్టి చెరువులు, కుంటలలో వేశారన్నారు. స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ కార్మికురాలు గా అనేక పోరాటాలను నిర్వహించిందన్నారు. మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి, భువనగిరి లో మహిళా సమస్య లను పరిష్కారం చేస్తూనే, బస్తీ వాసుల సమస్య లను పరిష్కరించిందన్నారు. వేశ్య వృత్తి లో మగ్గిన మహిళలను చైతన్యం చేసి, ఆ వృత్తి ని మాన్పించిందన్నారు. తెలంగాణ జనసభ ఆధ్వర్యంలో తెలంగాణ కళాసమితి కోకోన్వీనర్ గా ఉంటూ అనేక ఉద్యమాలను నిర్వహించిందన్నారు. బెల్లి లలితక్క విగ్రహన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలని, భువనగిరి జిల్లాకు లలితక్క పేరు పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ భాద్యులు ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్, గొర్లవీరన్న యాదవ్, మల్లం నరసింహ, సందేబోయిన రమేష్, సంపత్, రాగుల శ్రీనివాస్, దిలీప్, సందేబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love