
– మోతే, అక్లూర్ గ్రామాల్లో ఉపాధి హామీ పని ప్రదేశంలో ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బిజేపీలు హామీల అమలులో విఫలమయ్యాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన 5నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్ళే మిగిలాయని, హమీల అమలు కోసం మీ పక్షాన నిలబడి ప్రశ్నించే బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి బాజిరెడ్డి ని గెలిపించాలని కోరారు. బుధవారం ఆయన వేల్పూర్ మండలం మోతే, అక్లూర్ గ్రామాల్లో ఉపాధి హామీ పని ప్రదేశంలో టిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధి హామీ కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ…..కాంగ్రెస్ పార్టీ అనేక అలవి కానీ హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది కానీ 5 నెలల పాలనలోనే ప్రజలకు కష్టాలు కన్నీళ్లు మిగిలాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 100 రోజుల గడువు దాటి 148 రోజులు అయినా ఎందుకు హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.ఎంపీ ఎన్నికల సమయంలోనే ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్, ఎన్నికలు అయిపోయాక పట్టించుకోరని అన్నారు. మాది ప్రజాపాలన, మార్పు కోసం అంటూనే కరెంట్ కోతల్లో, త్రాగు, సాగు నీరు అందించడంలో కాలిపోతున్న మోటార్లతో అనేక అంశాలలో కాంగ్రెస్ మార్పులు తీసుకొచ్చింది అని ఎద్దేవా చేశారు.
ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలా? ప్రజలు, మహిళలు, యువత ఆలోచించాలని కోరారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టాలని కోరారు. అప్పుడే ఇచ్చిన హామీలు నెరవేర్చలన్న భయం వారికి కలుగుతదని ఎమ్మెల్యే అన్నారు.నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి ఏనాడు ఇక్కడ ప్రాంత ప్రజల మంచి చెడుకు రాలేదన్నారు.గత పార్లమెంటు ఎన్నికల సమయంలో 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని మాటిచ్చిన అరవింద్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి పసుపు బోర్డు తేవడంలో విఫలమయ్యాడన్నారు. అలాంటి వ్యక్తికి ఈ ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయాలో ఆలోచన చేయాలని కోరారు. ఇప్పుడేమో పసుపు బోర్డు సాధించానని చెబుతున్న అరవింద్, పసుపు బోర్డు సాధిస్తే ఆఫీస్ ఎక్కడ? చూపిస్తావా అని ప్రశ్నించారు. పసుపు పంట భారీగా సాగు తగ్గడం వల్లనే ధర ఈసారి పెరిగిందని, ఇందులో బీజేపీ ఘనకార్యం ఏమి లేదన్నారు.అరవింద్ ఎంపీగా ఉన్న 5 ఏండ్లలో అభివృద్ధి పనులకు ఏ గ్రామానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అన్నారు.బాజిరెడ్డి గోవర్ధన్ 40 ఏండ్లుగా రాజకీయ జీవితంలో 20 ఏండ్లు ఎమ్మెల్యేగా ప్రజల మధ్యనే ఉన్నాడని, ఎప్పుడు ఎవరికి ఏం అవసరం వచ్చిన ముందుంటాడన్నారు.ఈ ప్రాంత ఎమ్మెల్యేగా చేసిన అనుభవం కూడా ఉందన్నారు. కాంగ్రెస్ బిజెపి పార్టీ లు ఇచ్చిన హామీలు అమలు చేయాలి లేకుంటే ప్రజలు తిరస్కరిస్తారు అనే భయం వారిలో కలగాలన్నారు. మీ ఓటును బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డికి వేసి, నాకు తోడుగా ఆయనను ఇవ్వండని కోరారు. కాంగ్రెస్,బిజెపి పార్టీలు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరపున ఇద్దరం పోరాడుతామన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. మండల బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.