రమేష్ నాయక్ కార్తీక్ కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం

నవతెలంగాణ హైదరాబాద్:  యువ కవి, రచయిత రమేష్ నాయక్ కార్తీక్ కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2024 లభించింది.  రమేష్ నాయక్ కార్తీక్ కథల సంపుటి ‘ఢావ్లో’కు ఈ పురస్కారం ప్రకటించారు.
తెలంగాణకు చెందిన రచయిత. ఇతను తెలుగులోనూ, ఆంగ్లంలోనూ కథలు, వచన కవిత్వం, అనువాదం వంటి విభాగాల్లో సాహిత్య సృష్టి చేశాడు. రావిశాస్త్రి కథా పురస్కారం సహా వివిధ సాహిత్య పురస్కారాలను అందుకున్నాడు. రమేష్ కార్తిక్ నాయక్ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన గోర్ బంజారా కుటుంబంలో జన్మించాడు.  పదో తరగతిలోనే కవిత్వం రాయడం అలవాటైంది. గిరిజనుల జీవితాలు, మనస్తత్వాలు, కష్టసుఖాలు వస్తువులుగా కవిత్వం, కథలు రాయడం ప్రారంభించాడు.
గిరిజనుల జీవితాలు, మనస్తత్వాలు, సుఖదుఃఖాలను లోతుగా పరిశీలించాడు. ప్రపంచం ఎప్పటికప్పుడు మారిపోతూ కొత్త దారుల్ని వెతుకుతుంటే ‘మావాళ్లు’ ఇంకా అవే నమ్మకాల్ని గుడ్డిగా నమ్ముతూ గతంలోనే జీవిస్తున్నారని మదనపడ్డాడు. తను చూసిన బతుకుల్ని, వెతల్ని, కథల్ని కవిత్వంలో చెప్పాలనుకున్నాడు. ఆ క్రమంలో ఇతను రాసిన ‘బల్దేర్‌ బండి’ కవితా సంపుటిని 2018లో ప్రచురణ పొందింది. 2019 జనవరిలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. రమేశ్‌ కార్తిక్‌ నాయక్‌ రాసిన మొదటి పుస్తకానికే అనేక ప్రశంసలు అందాయి. కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన విద్యా సదస్సులో సన్మానం పొందారు. ఖమ్మంలో నవ స్వరాంజలి సంస్థ ఆధ్వర్యంలో సన్మానించారు. బల్దేర్‌ బండిలోని జారేర్‌ బాటి(జొన్నరొట్టెలు) అనే కవితను ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారు తెలుగు సాహిత్యంలో ఒక పాఠంగా పొందుపరిచారు.

Spread the love