స్వతంత్ర భారతం – సవాళ్లు

Independent India - Challengesస్వతంత్ర భారతావనికి 76ఏండ్లు నిండాయి. స్వతంత్ర దినోత్సవమనే పేరే తప్ప ఉత్సాహం లేదు. మండుతున్న మణిపూర్‌లో నడిబజారులో వస్త్రాప హరణానికి బలవుతున్నది మహిళ. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, మహిళల మీద లైంగిక దాడులు, కులదురహంకార దాడులకు హద్దుల్లేవు. వీటిని పరిష్కరించవల్సిన పాలకులే, ప్రజల దృష్టిని మరలించి మణిపూర్‌, హర్యానా వంటి రాష్ట్రాలలో మంటలు సృష్టించారు. ఉమ్మడి పౌరస్మృతి ముందుకు తెచ్చారు. రాజ్యాంగ విలువలనే ఖాతరు చేయని పాలకులు! ఎందుకీ దుస్థితి ఏర్పడింది. దీనికి పరిష్కారం ఏమిటి?
స్వతంత్ర భారతదేశ స్వభావం గురించిన చర్చ ఈనాటిది కాదు. వైవిధ్యభరితమైన సంస్కృతులు, సంప్రదాయాల సమాహారమే భారతదేశమన్న మౌలిక విషయాన్ని జాతీయోద్యమ స్రవంతి గుర్తించింది. దానికి భరోసా ఇచ్చే ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర రాజ్యంగా ఉండాలని నిర్ణయించింది. అంతటితో ఆగకూడదని కమ్యూనిస్టు ఉద్యమం భావించింది. ప్రజలకు నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలన్నది. అది జరగనప్పుడు ప్రజల అసంతృప్తిని మతోన్మాద విచ్ఛిన్నకర శక్తులు వినియోగించుకుంటాయని హెచ్చరించింది. మత ప్రాతిపదికన పాలన సాగించాలన్నది మూడవ వాదన. దీనికి సైద్ధాంతిక పునాదినిచ్చినవాడు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌. ‘హిందూత్వ’ పేరుతో 1923లో ఆయన ప్రచురించిన పత్రమే ప్రాతిపదిక. ‘హిందూత్వ’ ఒక రాజకీయ నినాదం మాత్రమేనని స్వయంగా సావర్కరే చెప్పారు. సావర్కర్‌ ఇంతటితో ఆగలేదు. మత ప్రాతిపదికన ద్విజాతి సిద్ధాంతం ప్రకటించారు. ఈ నినాదాన్ని మహ్మద్‌ అలీ జిన్నా అందుకున్నారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాన్ని పాకిస్థాన్‌గా ప్రకటించాలన్నారు. బ్రిటిష్‌ పాలననుంచి స్వాతంత్య్రం పొందుతూ ఇండియా, పాకిస్థాన్‌లు ఏర్పడ్డాయి. వెనుకబడిన ఛాందసవాదం, నియంతృత్వం ప్రాతిపదికన పాకిస్థాన్‌ పాలన సాగింది. ఇందుకు భిన్నంగా, ఒకడుగు ముందుకేసి, అభివృద్ధి కరమైన ఆలోచనలతో, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర రాజ్యంగా భారతదేశం ప్రకటించుకున్నది. మతోన్మాదులకు ఇది గిట్టలేదు. ఆగ్రహంతో గాంధీజీని పొట్టన పెట్టుకున్నారు.
స్వాతంత్య్రోద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర అనిర్వచనీయం. బ్రిటిష్‌ ఇండియాలో జాతీయోద్యమం లోనూ, సంస్థానాలలో జమీందారీ విధానానికీ, రాచరికానికీ వ్యతిరేకంగా పోరాడిన త్యాగధనులు. భారత కమ్యూనిస్టు పార్టీ 4వ మహాసభలకు హాజరైన ప్రతినిధులందరూ స్వాతంత్య్ర సమరయోధులే! 407మంది ప్రతినిధుల జైలు జీవితమంతా కలిపితే 1344 సంవత్సరాలు. సగటున ఒక్కొక్కరు మూడేండ్లు జైలులో గడిపారు. ఈ దేశంలో ఏ పార్టీకి ఈ చరిత్ర ఉన్నది? ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త సావర్కర్‌, జైలునుంచి విడుదల చేస్తే, బ్రిటిష్‌ వారి సేవలో కాలం గడుపుతానని మోకరిల్లి బయటపడినవారే కదా! ఎమర్జెన్సీ కాలంలో బాలాసాహెబ్‌ దేవరస్‌ చేసిన పనేమిటి? తాను జైలులో ఉండేకంటే, బయట ఉంటేనే ”మీకు ఉపయోగకరం” అని ఇందిరాగాంధీతో రాయబారాలు నడిపి బయటపడ్డారు కదా!
కులమతాలకతీతంగా సాగిన వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భవిష్యత్తు భారత దేశానికి మార్గదర్శి అయ్యింది. పోరాడిన కష్టజీవులకు మతం ఆటంకం కాలేదు. ఆ పోరాట ఫలితమే హైదరాబాద్‌ రాజ్యం స్వతంత్ర భారత దేశంలో విలీనం. బెంగాల్‌ ప్రాంతంలో తెభాగ రైతాంగ పోరాటం మరో మైలురాయి. పోలీసు కాల్పులకు హిందూ, ముస్లిం, ఆదివాసీ రైతులు నేలకొరిగారు. ఎర్రజెండా వెలుగులో రైతాంగ పోరాటం ఉధృతంగా సాగుతున్న నావోఖాలి, తిప్పెర జిల్లాలను, చుట్టూ జరుగుతున్న మతకొట్లాటలు తాకలేకపోయాయి. అప్పటిదాకా మతంపేరుతో పరస్పర దాడులకు పాల్పడ్డ బీహార్‌ పేద రైతాంగం, ఎర్రజెండా ప్రవేశంతో ఏకమై, భూస్వాములమీద తిరుగుబాటు చేసారు. పున్నప్ర, వాయలార్‌లో కూడా హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన పేదలంతా ఎర్రజెండా ఆయుధంగానే రాచరికాన్ని ప్రతిఘటించారు. అస్సాం, సుర్నా లోయ ప్రాంతాలలో రైతాంగ పోరాటం కూడా మరువలేనిది. కౌలురైతులు, కుటుంబం అంతా భూస్వాములకు చాకిరీ చేస్తున్న హిందూ, ముస్లిం నాన్కార్లు సాగించిన తిరుగుబాటు. ఇదీ అరుణ పతాకం నీడలోనే. షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో జమీందారీ, రాచరిక వ్యవస్థల మీద తిరుగుబాటు చేసిన రైతాంగం కాశ్మీరీ ముస్లింలు. పాకిస్థాన్‌ను ఆనుకుని ఉన్నప్పటికీ, ముస్లిం ఛాందసవాదాన్ని తిరస్కరించి, వీరంతా లౌకిక భారతదేశంలో విలీనం కావడానికి మార్గం చూపింది ఈ పోరాటమే! బ్రిటిష్‌ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం, సంస్థానాలలో సాగిన భూస్వామ్య, రాచరిక వ్యతిరేక పోరాటాల ఫలితమే నేటి భారత జాతీయ భావన. సకల సంస్కృతుల సమైక్య జీవనధార. అదే నేటి భారతదేశానికి పునాది. వైవిధ్యాన్ని నిరాకరించటమంటే విచ్ఛిన్నానికి బాటలు వేయడమే.
మతభావాల కతీతంగా సాగుతున్న స్వాతంత్య్రోద్యమంలో మతోన్మాద చిచ్చు రగిల్చింది ఆర్‌ఎస్‌ఎస్‌. ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమకాలంలో తెల్లదొరలముందు సాగిలపడింది. లాలా లజపతిరారు మతరాజ్యమన్న భావననే తిరస్కరించారు. స్వరాజ్యం నా జన్మహక్కు అని నినదించిన బాలగంగాధర తిలక్‌ ప్రజలను కదిలించేందుకు పండుగలను వినియోగించుకున్నారే తప్ప హిందూ రాజ్యమన్న భావనకు లోనుకాలేదు. స్వాతంత్య్రోద్యమ నేత శ్రీనివాస అయ్యంగార్‌ మతతత్వం జాతీయతకు విరుద్ధం అన్నారు. స్వరాజ్యానికి అడ్డుకట్ట అన్నారు. బ్రిటిష్‌ పాలకుల చేతిలో ఉన్న ఇండియన్‌ ఆర్మీలో చేరవద్దని ముస్లింలీగ్‌ తీర్మానించింది. ఇందుకు భిన్నంగా యువత ఆర్మీలో చేరాలని ఆర్‌ఎస్‌ఎస్‌ పిలుపునిచ్చింది. 1922లో సహాయ నిరాకరణోద్యమాన్ని గాంధీజీ ఉపసంహరించినపుడు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం కొనసాగించాలని ముస్లింలీగ్‌ కోరింది. 1920లో మొట్టమొదట కమ్యూనిస్టులు సంపూర్ణ స్వాతంత్య్రం నినాదమిచ్చారు. 1922లో ఖిలాఫత్‌ ఉద్యమం కూడా సంపూర్ణ స్వాతంత్య్రం కోరుతూ తీర్మానం చేసింది. సావర్కర్‌ ప్రకటించిన హిందూత్వ, ద్విజాతి సిద్ధాంతంతోనే ఒకవైపు హిందూ మతోన్మాదం, మరోవైపు ముస్లిం మతోన్మాదం మొదలైంది. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనవద్దనీ, తమ యవ్వన జీవితాన్ని వృధా చేసుకోవద్దనీ యువతకు గోల్వాల్కర్‌ బహిరంగంగానే పిలుపునిచ్చారు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా 1939లో కాంగ్రెసు పాలనాధికారులు రాజీనామా చేసిన సమయంలో సావర్కర్‌ మాత్రం వైస్‌రారుని కలిసి మద్దతు తెలిపారు.
ఆర్‌ఎస్‌ఎస్‌ మార్గదర్శకత్వంలో నడుచుకుంటున్న బీజేపీ నేతలు, ప్రస్తుత కేంద్ర పాలకులు ప్రజాస్వామ్య, లౌకిక పునాదుల మీద దాడి ఉధృతం చేసారు. మత ప్రాతిపదికన పాలనను వ్యతిరేకించిన సర్దార్‌ పటేల్‌ను, మతఘర్షణలకు కారణమైన ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించిన ఆయనను హిందువుల ప్రతినిధిగా చిత్రీకరిస్తున్నారు. రాముడిని ఉపయోగించుకుని ఉండకపోతే తాను ఢిల్లీలో గెలిచేవాడినే కాదని అద్వానీ ఒప్పుకున్నారు. గుడి ఉద్యమం రాజకీయపరమైందే తప్ప మతానికి సంబంధంలేదని సుష్మా స్వరాజ్‌ అంగీకరించారు. గాంధీ జాతిపిత కాదని అద్వానీ అన్నారు. గాడ్సే దేశభక్తుడని సాక్షి మహరాజ్‌ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో ఈ మతోన్మాదుల ఆటలు సాగలేదు. ఆర్థిక స్వాతంత్య్రం వైపు అడుగులు వేయకపోవటం, సుదీర్ఘకాలం సాగిన కాంగ్రెస్‌ పాలనా వైఫల్యాలను మతోన్మాదులు వాడుకోగలిగారు.
ఒకవైపు బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటం, మరోవైపు పెట్టుబడిదారులు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం మాత్రమే మత కొట్లాటలను అధిగమించగలదనీ, కార్మిక కర్షక ఐక్యత సాధించే మార్గమనీ కమ్యూనిస్టు పార్టీ భావించింది. జాతీయోద్యమ కాలమంతా ఆ దిశలోనే పయనించింది. ప్రజాతంత్ర ఉద్యమం బలహీనంగా ఉన్న ప్రాంతంలో మతోన్మాదం బలపడుతోందని 1953 నాటికే కమ్యూనిస్టు పార్టీ గుర్తించింది.
దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం బలహీనంగా ఉన్న ప్రాంతాలలోనే, లేదా బలహీనపడిన తర్వాతనే మతోన్మాదం పుంజుకున్నది. తెలంగాణలో సైతం వామపక్ష ఉద్యమం బలహీనంగా ఉన్న ప్రాంతాల్లోనే మతకొట్లాటలు ప్రారంభమైనాయి. రైతాంగ పోరాటం విస్తరించని ప్రాంతాలలోనే (ఇప్పుడవి మహారాష్ట్ర, కర్నాటకలో ఉన్నాయి) మతోన్మాదం బలపడింది. 1970 మార్చి 2న బొంబాయి నగరంలో మతోన్మాదులు మత కొట్లాటలు రగిల్చారు. మార్చి 4న వేలాదిగా వ్యవసాయ కార్మికులు ఎర్రజెండాలతో బొంబాయి నగరంలో కదం తొక్కారు. వర్గ పోరాట బాట చూపారు. వామపక్షం బలంగా ఉంటే ఏమి చేయగలదో కేరళ వామపక్ష ప్రభుత్వం చేసి చూపిస్తున్నది. దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం బలంగా ఉన్నమేరకు సాధించిన విజయాలు తక్కువేమీ కాదు. బూర్జువా భూస్వామ్య రాజ్యాంగం పరిధిలో కూడా పరిమిత ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేసి చూపించాయి. మూడు రాష్ట్రాలలో వామపక్ష ప్రభుత్వాలు విద్య, వైద్యం, భూమి, ప్రజాపంపిణీ వ్యవస్థలను ప్రజలకు అందుబాటులోకి తేగలిగాయి. మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు భద్రత కల్పించగలిగాయి. ప్రజాస్వామ్య, లౌకిక విలువలు కాపాడగలిగాయి. దేశంలో తొలి గిరిజన స్వయంపాలక సంస్థను సాధించుకున్నది త్రిపురలోనే. నియంతృత్వ వ్యతిరేక పోరాటంలో, రాష్ట్రాల హక్కులూ, అధికారాల కోసం సాగిన ఉద్యమంలో వామపక్ష ప్రభుత్వాల పాత్ర చిన్నది కాదు. దేశంలో ఇంతకాలం ప్రభుత్వ రంగం, ప్రజాస్వామ్యం, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు బతికున్నాయంటే అది ఎర్రజెండా పుణ్యమేనని ప్రజాస్వామ్యవాదులంతా అంగీకరిస్తారు.
ఇప్పుడు కూడా మతోన్మాద ప్రమాదాన్నుంచి దేశాన్ని రక్షించే కృషిలో కీలక పాత్ర ఎర్రజెండా ఉద్యమానిదే. అందుకే కన్నూర్‌లో జరిగిన సీపీఐ(ఎం) మహాసభల తీర్మానంలో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయటమే ప్రథమ కర్తవ్యంగా నిర్దేశించింది. జరిగిన నష్టానికి ఆందోళన చెందటం కాదు. కర్తవ్యం మీద దృష్టి సారించాలి. పార్లమెంటరీ, పార్లమెంటరీయేతర పోరాటాల సమన్వయలోపం పార్లమెంటరీ భ్రమలకు దారితీసింది. ఈ విషయాన్ని కూడా కన్నూర్‌ మహాసభ స్పష్టంగా గుర్తించింది. వామపక్ష పునాది చెదరటం శాశ్వతం కాదు. వెనక్కి లాగిన తర్వాతనే బాణం శరవేగంతో ముందుకు సాగుతుంది. లక్ష్యం ఛేదించాలన్న సంకల్పం కావాలి. ‘సిద్ధాంత బలం’ అనే ఆయుధం ఉండనే ఉన్నది.
ఎస్‌. వీరయ్య

Spread the love