పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం తన ఏకరూప-కార్పొరేట్ ఎజెండాకు మరింత పదును పెట్టి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మంటకలిపింది. పార్లమెంట్ సమావేశాలు జులై 20న ప్రారంభమై శుక్రవారంతో ముగిశాయి. జనాన్ని భక్షించే, అవస్థలపాల్జేసే, ఇంకా ఇంకా సహజ వనరుల దోపిడీకి ఆస్కారం కలిగించే బిల్లులను ఆమోదింపజేసుకుకోడానికి, ప్రతిపాదించడానికి పార్లమెంట్‌ను మోడీ ప్రభుత్వం ఒక సాధనంగా వాడుకుంది. ఏడెమిది మాసాల్లో సార్వత్రిక ఎన్నికలుండగా ఇప్పుడూ ప్రజల కంటే మతతత్వ-కార్పొరేట్ కార్యాచరణకే నడుంకట్టింది. ఇదే తన అసలు సిసలైన ఎజెండా అని అరమరికలు లేకుండా స్పష్టం చేసింది. ఎగువ, దిగువ సభలు కలిపి 21 బిల్లులు ఈ సమావేశాల్లో ఆమోదం పొందాయి. చట్టరూపం దాల్చిన వాటిలో అత్యంత దుర్మార్గమైనవి అటవీ (సంరక్షణ) చట్టం, గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం. ప్రజలతో పర్యావరణంతో సంబంధం లేకుండా ప్రయివేటు పెట్టుబడిదారులు జాతీయ వనరులను దోచుకోడానికి, అడవులపై ఆధారపడ్డ ఆదివాసీల, ఇతర పేదల భూములు లాక్కోడానికి ఈ చట్టాలు బాగా ఉపకరిస్తాయి.
1980 నాటి అటవీ చట్టం ప్రధానోద్దేశం నిర్లక్ష్యపూరిత దోపిడీ నుంచి అడవులను రక్షించడం. 2006లో తెచ్చిన అటవీ హక్కుల చట్టంలో గిరిజనులు, ఇతర సంప్రదాయ అటవీ వాసులకు భూములపై హక్కులు కల్పించేందుకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ప్రస్తుత చట్టంలో రోడ్లు, మౌలిక సదుపాయాల, వంటి వాటికి అటవీ భూములను స్వేచ్ఛగా తీసుకొనే వెసులుబాటు కల్పించారు. పర్యావరణానికి హాని తలపెట్టి నిరంతర మైనింగ్‌ల ద్వారా వనరులను దోచుకోడానికి వీలుగా సవరణలు చేశారు. బిల్లుల ఆమోదానికి ఏ విధంగా బుల్డోజ్ చేశారంటే కనీసం అటవీ, పర్యావరణ అంశాలపై పరిశీలనకు ఉన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి బిల్లులపై కనీస సమాచారం ఇవ్వకుండా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ విషయాన్ని కమిటీ ఛైర్మన్ జైరాంరమేష్ చెప్పారు. తాను ఛైర్మన్ పదవిలో ఉండనని ప్రకటించారు. మోడీ ప్రభుత్వం పార్లమెంటరీ నిబంధనలను, సంప్రదాయాలను తుంగలో తొక్కుతోందనడానికి ఈ దృష్టాంతం తిరుగులేని ఉదాహరణ. ఢిల్లీ ప్రభుత్వ పాలనపై కేంద్ర పెత్తనానికి ఉద్దేశించిన ఢిల్లీ సర్వీస్ బిల్లు సమాఖ్య వ్యవస్థపై మోడీ సర్కారు చేసిన దాడి. డేటా ప్రొటెక్షన్ బిల్లు పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది. మల్టీ కోపరేటివ్ సొసైటీల బిల్లు రాష్ట్రాల పరిధిలోని సహకార వ్యవస్థపై కేంద్రం పెత్తనం చేయడానికి ఉద్దేశించినది. బిల్లుల్లో చాలా మట్టుకు మూజువాణి ఓటుతో అమోదం పొందాయి. అంతా ఏకపక్షం.
మోడీ సర్కారు తీసుకొచ్చిన మరో దుర్మార్గమైన బిల్లు కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, సభ్యుల నియామకాలకు సంబంధించినది. పార్లమెంట్ చట్టం చేసే వరకు ఎంపిక కమిటీలో ప్రధాని, లోక్‌సభ ప్రతిపక్షనేత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సిజెఐ) ఉండాలని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. బిల్లులో ఎంపిక కమిటీ నుంచి సిజెఐని ప్రభుత్వం తొలగించింది. కమిటీలో ప్రధాని నామినేట్ చేసిన కేబినెట్ మినిస్టర్‌ను చేర్చింది. ఇసిపై పెత్తనానికే ఈ బిల్లు. అంతేకాదు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానే మూడు కొత్త కోడ్‌లు, సిఆర్‌పిసి పేరును భారతీయ నాగరిక్ సురక్ష సంహిత చట్టం, ఐపిసి పేరును భారతీయ న్యాయ సంహితగా మార్పు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పేరును భారతీయ సాక్ష్యాధారాల చట్టంగా మార్చేందుకు చివరి రోజు మూడు బిల్లులు తీసుకొచ్చింది.. రాజద్రోహం అనే పదాన్ని తీసేసి అంతకంటే క్రూరమైన నిబంధనలను జోడించింది. చట్టాలకు హిందీపేర్లు పెట్టడం ఏకరూప సిద్ధాంత అమలులో భాగం. ఆ ముసుగులో పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే, అణచివేతను పెంచే చట్టాలు చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరిని స్పష్టం చేస్తుంది. రాజ్యసభలో ఆప్ ఎంపి, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత సస్పెన్షన్ బీజేపీ అసహనానికి నిదర్శనం. మణిపూర్‌పై అవిశ్వాస తీర్మానం, ఢిల్లీ బిల్లుపై, ఇంకా ఇతర అంశాలపై ప్రతిపక్ష ‘ఇండియా’ మోడీ ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పోయించడం కొత్త పరిణామం. బీజేపీ ఓటమే లక్ష్యంగా ‘ఇండియా’ కార్యాచరణ బలోపేతం కావాలి. ఇదే ప్రజల ఆకాంక్ష.