– జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు
– నవతెలంగాణ-షాద్‌నగర్
మన జిల్లాకు నిర్ణయించిన లక్ష్యాలను వంద శాతం చేరుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు.షాద్ నగర్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులకు, ఎంఎల్ హెచ్‌పీ వైద్య అధికారులకు, హెల్త్ సూపర్‌వైజర్లు, ఫార్మసిస్టు, డీఈవో ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్‌ఎంలకు సమీక్షా సమావేశం నిర్వహించారు. షాద్ నగర్ డివిజన్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు రావు పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మన జిల్లాకు నిర్ణయించిన లక్ష్యాలను వంద శాతం చేరుకోవాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. ప్రతి వైద్య అధికారి, హెల్త్ సూపర్‌వైజర్, ఏఎన్‌ఎంలకు నిర్ణయించిన లక్ష్యాలు సాధించగలిగితే ఆటోమేటిక్‌గా జిల్లా లక్ష్యాలు వస్తాయన్నారు. ప్రతి ఏఎన్‌ఎం కూడా గర్భిణులను ఎర్లీగా రిజిస్ట్రేషన్ చేసి ఆన్‌లైన్‌లో డేటా ఎప్పటి కప్పుడూ పూర్తి చేయాలన్నారు. గర్భిణుల పేర్లు రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే వారికి టి.టి సూదిని వేసి, ఐరన్ పోలిక మాత్రలు తప్పకుండా ఇవ్వాలని సూచించారు. ఐరన్ పోలిక మాత్రలతో పాటు వారికి పోషకాహారంపై అవగాహన కల్పించినట్టు చెప్పారు. గర్భిణుల్లో ఐరిస్క్ కేసులు ఉన్నారో వారిపై శ్రద్ధ వహించి గైనకాలజిస్ట్‌తో తప్పకుండా పరీక్షలు చేయించాలని, వాటిపై వారికి అవగాహన కల్పించే బాధ్యత ఏఎన్‌ఎం లకు ఉటుందన్నారు. గర్భ వతులు ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు అయ్యే విధంగా వారికి సూచనలు, సలహాలు ఇవ్వాలని తెలిపారు. ప్రతి గర్భవతికి ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కావడం వలన, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం, కేసీఆర్ కిట్టు అందించనున్నట్టు తెలిపారు. రెండేండ్ల పిల్లలందరికీ కూడా సంపూర్ణమైన వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని అన్నారు. ఫార్మసిస్టులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కావలసిన మందులు ఎప్పటి కప్పుడూ జిల్లా నుంచి తెచ్చుకోవాలన్నారు. గర్భిణులు చెకప్ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చినప్పుడు రక్తహీనత పరీక్ష తప్పకుండా నిర్వహించి, వారికి తగిన మందులు ఇవ్వాలని తెలిపారు. వైద్యాధికారులకు ప్రతిరోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వారు విధి నిర్వహిస్తూ , వారి కింద స్థాయి ఉద్యోగులు కూడా సమయపాలన పాటించాలని హెచ్చరించారు. కొత్తగా వచ్చిన ఎంఎల్‌హెచ్‌పీ వైద్య అధికారులకు వారి బాధ్యతలను గుర్తు చేసి, ప్రతిరోజు కూడా ఓపి పేషెంట్లను చూస్తూ, ఈ సంజీవిని కేసులను కచ్చితంగా 10 కేసులను ఆన్‌లైన్ ఎంట్రీ చేయాలని వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇమునైజేషన్ ఆఫీసర్ స్వర్ణ కుమారి, హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, ఎంఎల్‌హెచ్‌పీ వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.