‘చంద్ర’యానం…

పడిపోవటమే కాదు… పడితే లేచి నిలబడటం… దాన్నుంచి తడబడకుండా నడవడం… అన్నింటినీ ఎదుర్కొని ముందుకు సాగడం… చివరకు గెలిచి చూపించడం… అంటే ఏమిటో నిరూపించింది మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో). చంద్రమండలంపై పరిశోధనలకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 భారత కీర్తిని మరోసారి చరిత్ర పుటలకు చేర్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన రాకెట్‌ విజయవంతంగా భూకక్ష్యలోకి దూసుకెళ్లింది. నిర్ణీత సమయంలో వ్యోమనౌక నుంచి విడిపోయిన ఉపగ్రహం నిర్దేశిత గమ్యం వైపు వేగంగా పయనిస్తోంది. దాదాపు 24 రోజులు చంద్రుని చుట్టూ ప్రదిక్షణ చేసి ఆగస్టు 23 తర్వాత చంద్రునిపై దీని ల్యాండర్‌ అడుగుపెట్టనుంది. ఇది ఇస్రోకు అతిపెద్ద విజయం. ఈ రాకెట్‌ తయారీ కోసం రాత్రింబవళ్లు అహర్నిశలు కృషిచేసిన ఇస్రో బృందానికి యావత్తూ దేశం అభినందనలు తెలుపుతోంది.
కొత్త తరహాలో పరిశోధనలు, వాటి ఫలితాలు దేశానికి చాలా అవసరం. అయితే వైఫల్యాల నుంచి వచ్చే విజయాలు ప్రగతిని మరోమెట్టుకు ఎక్కిస్తాయి. అలాంటిదే నేటి చంద్రయాన్‌-3 విజయం. చంద్రునిపై వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం, భవిష్యత్తులో మానవ సహిత చంద్రయాన్‌ ప్రయాణానికి అవసరమైన పరిశోధనలను చేపట్టడం ఈ చంద్రయాన్‌-3 లక్ష్యం. దీనికంటే ముందే 2008లో చంద్రయాన్‌-1 ప్రయోగంతో పంపిన ఆర్బిటర్‌ చంద్రునిపై నీటి ఆనవాళ్లను గుర్తించింది. కానీ 2019లో చేపట్టిన చంద్రయాన్‌-2 ఇస్రో చరిత్రలో పాక్షిక విజయాన్నే నమోదు చేసింది. అంతరిక్షంలోకి ఆర్బిటర్‌ ద్వారా ఒక ల్యాండర్‌ను, ఒక రోవర్‌ను పంపగా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ జరగకపోవడంతో అందులోని ప్రజ్ఞాన్‌ రోవర్‌ నిరూపయోగమైంది. ఆర్బిటర్‌ మాత్రం చాలాకాలం చంద్రుని చుట్టూ తిరిగి తన పరిశోధనలందించింది. అప్పట్లో ఇస్రో దీనిగురించి స్పందిస్తూ తొంభై ఎనిమిది శాతం ఈ ప్రయోగం విజయవంతమైనట్లు స్పష్టం చేసింది. మొదటి, రెండు ప్రయోగాల తర్వాత ఇస్రో ఆకాశమంత అనుభవాన్ని సాధించింది. అపజయాలను విజయాలకు సోపానాలుగా మలుచుకుంది. రెట్టించిన ఉత్సాహంతో కొత్త సాంకేతిక పరికరాలకు రూపకల్పన చేసింది. అదే చంద్రయాన్‌-3. ఈసారి ప్రయోగంలో ఆర్బిటర్‌ను ప్రవేశపెట్టలేదు. కేవలం లాండర్‌, రోవర్‌లను మాత్రమే చేర్చింది. మూడు వేల తొమ్మిది వందల కిలోల బరువు ఉన్న లాండర్‌, రోవర్‌, ఇతర ఉపకరణాలను ఎస్‌వీఎం3-ఎం4 భారీ రాకెట్‌ నింగికి మోసుకెళ్లింది.
ప్రపంచంలో అనేక దేశాలు, పరిశోధనా సంస్థలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాయి. మరెన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇరవై ఏండ్ల కిందట మనం ఎవరితోనైనా మాట్లాడాలంటే ల్యాండ్‌ఫోనే దిక్కు. కానీ పరిశోధనలతో 2జీ నుంచి మొదలుకుని ఇప్పుడు 5జీ వరకు స్మార్ట్‌ఫోన్‌ సేవలు పొందుతున్నాం. ఇవన్నీ పరిశోధనలు అందించిన ఫలితాలే. మనం సాధించిన అత్యాధునిక సాంకేతికతకు ప్రతీకలే. వీటన్నింటిలోకి అత్యున్నతమైనది అంతరిక్ష పరిశోధన. ఇందులో భారత్‌ సాధించిన ఒక అద్భుత విజయం చంద్రయాన్‌-3. మరి ఇలా చంద్రునిపై ప్రయోగం చేసినవాళ్లే లేరా? అంటే ఇప్పటికే చంద్రునిపై అడుగుపెట్టి సత్తాచాటిన వాటిలో చైనా, రష్యా, అమెరికా ఉన్నాయి.అ సరసన చేరే దేశాల్లో నాలుగో దేశంగా భారత్‌ తన కీర్తిప్రతిష్టలను ప్రపంచానికి చాటింది ఈ చంద్రయాన్‌ విజయం. చంద్రునిపై నీటి జాడలను కనుగొన్న హిస్టరీ కూడా ఇండియాదే. చంద్రయాన్‌-3 విజయవంతమైతే ప్రపంచ శాస్త్రవేత్తలు అనేక విషయాలను నేర్చుకునే అవకాశం ఉన్నది. భారత్‌ పరిశోధనల పట్ల ప్రపంచ మార్కెట్‌లో దీని డిమాండ్‌ కూడా అదే తీరుగా ఉండనుంది. ఇక ఇతర దేశాలు ఈ రాకెట్‌ లాంచింగ్‌కు దాదాపు రూ.5వేల కోట్లు ఖర్చు పెడుతుంటే భారత్‌ మాత్రం కేవలం రూ.615కోట్లతో రూపొందించడం ఇస్రో సాధించిన మరో ఘనత. చంద్రయాన్‌-3 విజయవంతమైన నేపథ్యంలో పిఎస్‌ఎల్‌వి అనే రాకెట్‌ను వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ప్రకటించారు. అలాగే వచ్చే నెల చివరిలో ఆదిత్య ఉపగ్రహ ప్రయోగం కూడా ఉంటుందని, దానికి సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. దీన్నిబట్టి చూస్తే రానున్న రోజుల్లో దేశమంతా సాంకేతిక విప్లవమే.

Spread the love