విజయవారి ‘గుండమ్మ కథ’ సినిమా చూసిన ప్రేక్షకులకు గుండమ్మ పాత్రను పోషించిన సూర్యకాంతంతో బాటు ఆమె ఇంట్లో కూర్చుని తినే దుర్గమ్మ పాత్రలో నటించిన ఛాయాదేవి కూడా మనకు మరపురాదు.
తెలుగు తెరపై గయ్యాళి ఎవరంటే సూర్యకాంతం తరువాత ఠక్కున గుర్తొచ్చే పేరు ఛాయాదేవి. అంతటి ఖ్యాతికెక్కిన నటి ఛాయాదేవి. తెలుగు సినిమాలలో 20 ఏళ్ల పాటు అత్త పాత్రైనా, పక్కింటోళ్లతో గొడవ పడే పాత్రైనా ఛాయాదేవి, సూర్యకాంతం ఉండాల్సిందే. వాళ్ల కోసమే గయ్యాళి పాత్రలు సష్టించిన సందర్భాలు ఎన్నో.
హీరోలకు ధీటుగా వెండి తెరపై సూర్యకాంతం-ఛాయాదేవి ద్వయం నటించిన సన్నివేశాలు అద్భుతంగా పండేవి. ఆమె పుట్టింది బందరులోని పేద కుటుంబంలో. ఐతే పెరిగింది గుంటూరు జిల్లాలోని ఓ గ్రామంలో. ఛాయాదేవి తల్లిదండ్రులు చనిపోవడంతో పసితనంలోనే ఆమెకు పెళ్లి చేశారు. కానీ అనారోగ్యంతో ఆమె భర్త మరణించాడు. బాల్యంలోనే వితంతువైంది. దాంతో ఆమె బ్రతుకు ప్రశ్నార్థకమయ్యింది. మరోవైపు కుటుంబంలో నిత్యం గొడవలతో తోడ పుట్టిన వాళ్లు ఆమె భవిష్యత్తుకు భరోసా ఇవ్వకపోగా ఆమె తమకు భారమైనదన్నట్లుగా ప్రవర్తించేవాళ్ళు. దీంతో ఛాయాదేవికి పరిస్థితులు అర్థమై తన దారి తాను చూసుకోవాలనుకున్నది. అలా నాటకాలపై దష్టి మళ్లించిన ఆమె నిర్మలమ్మతో కలిసి నాటకాలు వేసేది. కొన్నాళ్లకు నిర్మలమ్మకు సినిమాల్లో ఛాన్సులు రావడంతో మద్రాస్ వెళ్లిపోయింది.
దీంతో ఛాయాదేవి కూడా కొన్ని రోజులకు మద్రాస్ బాట పట్టింది. ఆ రోజులలో నాటకానుభవం ఉన్నవారికి సినిమాల్లో అవకాశాలు దక్కేవి.
ఐతే టాలెంట్ పసిగట్టడంలో ఆరితేరిన ఎన్టీ రామారావు తన సొంత చిత్రం ‘పిచ్చిపుల్లయ్య’ (1953)లో ఛాయాదేవికి నటనకు అవకాశం గల పాత్ర ఇచ్చి ప్రోత్సహించాడు. ఈ సినిమాలో ఎస్వీ రంగారావు, ఛాయాదేవిల నెగిటివ్ పాత్రలు సినిమాలో అద్భుతంగా పండాయి. ఆ కాంబినేషన్ తర్వాతనే వారిరువురూ మంచి సన్నిహితులుగా మారారు. ఎన్టీ రామారావు పిచ్చి పుల్లయ్య తర్వాత తీసిన చిత్రాలలో కూడా ఛాయాదేవికి మంచి వేషాలనే ఇచ్చాడు. మచ్చుకు ‘పాండురంగ మహాత్యం’లో వేసిన వేశ్యమాత పాత్ర చెప్పుకోదగింది.
ఐతే ఛాయాదేవి ఎంత ప్రయత్నం చేసినా చిన్నా చితక పాత్రలే పోషించింది అక్క, అమ్మ, అత్త, వదిన, వాంప్, గయ్యాళి పాత్రలలో తనకాలపు ప్రసిద్ధ నటి సూర్యకాంతానికి ధీటైనా సమఉజ్జీ అనిపించుకున్నది. నిజానికి ఛాయాదేవి అంతకు పదేండ్లకు మునుపే తెలుగుతెరకు పరిచయమైంది. ఛాయాదేవి నటించిన తొలి సినిమా 1944లో వచ్చిన ‘దీనబంధు’. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె చిత్తూరు నాగయ్య రేణుక ఫిలిమ్స్ వారి మెస్‌లో పని చేయడం ప్రారంభించింది. అక్కడ ఆమె అడిగిన వారందరికీ లేదనకుండా అన్నం పెట్టేది.
ఛాయాదేనికి ఒక ఐదారేళ్ల తర్వాత ‘శ్రీ సాయిబాబా’ (1950) సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఆమె ఘంటసాల బలరామయ్య ‘చిన్నకోడలు'(1952), రేణుకా వారి ‘నా ఇల్లు’, ‘పెంపుడు కొడుకు’, ప్రపంచం, లక్ష్మి (1953) చిత్రాలలో నటించింది. అయితే ఛాయాదేవి నటన ప్రేక్షకులను ఆకర్షించింది. ఎన్టీ రామారావు ‘పిచ్చి పుల్లయ్య’ చిత్రంలో విలన్ వేషం వేసిన గుమ్మడికి వంతపాడే వాంపు తరహా పాత్రలో ఛాయాదేవి నటన ఆ రోజుల్లో చాలామందిని ఆకట్టుకుంది. ఆమె సినీ జీవితానికి ఇదే మలుపుగా మారింది.
ఆ తర్వాత ఛాయాదేవి ‘అన్నదాత, చక్రపాణి, కన్యాశుల్కం (1955), చింతామణి, చిరంజీవులు, పెంకి పెళ్ళాం (1956), పాండురంగ మహాత్మ్యం, భలే అమ్మాయిలు, మాయాబజార్ (1957), ఆడపెత్తనం, పెళ్లినాటి ప్రమాణాలు (1958) సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి(1960), బాటసారి, సీతారామ కళ్యాణం,(1961), గుండమ్మ కథ, గులేబకావళి, దక్షయజ్ఞం (1962), శ్రీ కష్ణార్జున యుద్ధం (1963), పూజాఫలం, మంగమ్మ శపథం (1965), ఆత్మగౌరవం (1966), పలనాటి యుద్ధం (1966), అగ్గిదొర, ఉమ్మడి కుటుంబం, చిక్కడు దొరకడు, శ్రీకష్ణావతారం (2967), ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968), కధలడు వదలడు (1969), తల్లా పెళ్లామా (1970), చెల్లెలికాపురం, కథానాయకురాలు, దసరా బుల్లోడు, రైతుబిడ్డ (1971), పాపం పసివాడు (1972), గంగ మంగ, జీవన తరంగాలు, తాతా మనవడు, మీనా (1973), దేవదాసు (1974), జ్యోతి, పాడిపంటలు (1976), యమగోల (1977), డ్రైవర్ రాముడు, శ్రీమద్విరాట పర్వము (1979)’ వంటి దాదాపు 200లకు పైగా సినిమాలు చేసింది.
నటిగా ఆమెకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది గుండమ్మ కథ చిత్రంలోని పాత్రకు. గుండమ్మగా నటించిన సూర్యకాంతానికి ధీటుగా ఛాయాదేవి పాత్ర ప్రేక్షకులను రక్తి కట్టించింది. ఆ ఇంట్లో ఎదురులేని గుండమ్మగా నటించిన సూర్యకాంతంను ఇంట్లోంచి తరిమి వేసే దుర్గమ్మ పాత్రలో ఛాయాదేవి అత్యంత సహజంగా జీవించింది. అంతకు ముందు వచ్చిన చింతామణి సినిమాలో శ్రీహరి పాత్రలో జీవించింది. ఆమె రంగస్థలంపై కూడా చింతామణిలో శ్రీహరి గానే నటించేది. 1957లో వచ్చిన మాయాబజార్ లో కూడా ఆమె బలరాముని భార్య రేవతిగా, సూర్యకాంతం హిడింబిగా రెండు భిన్నమైన పాత్రలు పోషించారు.
1970 దశకంలోని ఆఖరిలో వచ్చిన ఒక రంగుల చిత్రంలో సూర్యకాంతంతో ఛాయాదేవి ముష్టి యుద్ధం చేసే దశ్యం ఒకటి చిత్రీకరించబడింది. అట్లా వాళ్లు ఒక రెండు దశాబ్దాల పాటు విజయవంతమైన హాస్య ధ్వయంగా కొనసాగారు.
అయితే వ్యక్తిగత జీవితంలో ఛాయాదేవి ఎప్పుడూ పెళ్ళికి దూరంగానే ఉండింది. జీవితాంతం ఒంటరిగానే ఉండిపోయింది. దీంతో ఆమెకు కుటుంబ జీవితం లేకుండా పోయింది. అయితే ఆ కాలపు మహానటుడు ఎస్వీ రంగారావు ఛాయాదేవికి అండగా ఉండేవాడు. ఆమె సంపాదించినదంతా ఏమాత్రం వధా చేయకుండా భద్రంగా దాచుకునేది. ఆమె వద్ద అలా దాచుకున్న డబ్బు చాలానే ఉందని తెలుసుకున్న కొందరు నిర్మాతలు సినిమాలకు పెట్టుబడి కోసం వడ్డీకి అప్పు తీసుకునే వాళ్ళు. అవి సక్రమంగా తిరిగి చెల్లించేవారు కూడా. అయితే ఎవరైనా తిరిగి చెల్లించడంలో ఆలస్యం చేసినా, చెల్లించకూడదని నిర్ణయించుకున్నా, అప్పుడు ఎస్వీ రంగారావు గారు జోక్యం చేసుకుని ”సంగతి ఏమిటని” గర్జించగానే కిక్కురుమనకుండా ఛాయదేవి సొమ్ము, పువ్వుల్లో పెట్టి తిరిగి ఇచ్చి వెళ్లేవాళ్లు. వాళ్ళిద్దరి స్నేహ సంబంధాల గురించి పరిశ్రమలో అంతా బహిరంగ రహస్యంగానే ఉండేది. ఎస్వీ. రంగారావు గారు ఒక రకంగా ఆమెకు పెద్ద వెన్నుదన్నుగా ఉండేవాడు.
ఛాయాదేవి సంపాదించిన డబ్బుతోనే సొంతంగా ఇల్లు కట్టుకున్నది. దాచుకున్న డబ్బును వడ్డీలకు ఇచ్చేది. వడ్డీ మీద వచ్చే ఆదాయంతో బాగానే కూడ బెట్టింది. ఇంతలో ఎస్వీ రంగారావు 1974లో చనిపోయారు. అదే అదునుగా అప్పులు తీసుకున్న వాళ్లు డబ్బులు ఎగ్గొట్టారు. ఆయన అండలేదని తెలిసిన మరుక్షణమే సమస్యలు తెచ్చిపెట్టడం మొదలుపెట్టారు. ఛాయాదేవి ఇల్లు మాదంటూ ముగ్గురు కోర్టుకు ఎక్కారు. వారిలో ఒకతను ఆమె సాయంతోనే నిర్మాతగా మారిన వ్యక్తి కావడం ఛాయదేవిని మరింత బాధపెట్టింది. వీరందరూ ఇలా ఉండగానే మరెవరో తాను ఛాయాదేవికి మేనల్లుడిని అంటూ తెరమీదకి వచ్చి ఇంట్లో భాగం ఉందని ముందుకు వచ్చాడు. ఇలా అంతా కేసులు వేసుకుని కోర్టు చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. ఈ పరిణామాలన్నీ ఛాయదేవిని మరింత బాధ పెట్టినవి.
ఆ సమయంలో ఛాయాదేవికి ఎవరూ సహకరించలేదు. వీటికి తోడు ఛాయాదేవి అనారోగ్యానికి గుచరైంది. మధుమేహ వ్యాధి వచ్చింది. ఆరోగ్య సమస్యలు పెరిగినవి. పాదానికి చిన్న గాయం తగిలి బొటనవేలు తీయవలసి వచ్చింది. కానీ తర్వాత ఆ గాయం పెద్దది కావడంతో ఆమె కాలు తీసివేయకపోతే ప్రాణహాని ఉందని డాక్టర్ చెప్పడంతో చివరికి అది కూడా జరిగిపోయింది. నిలువెత్తు మనిషి భారీ కాయంతో, తెరనంతా ఆక్రమించే ఒక నటికి కాలు తీసేయడం కన్నా మరొక దుస్థితి ఏముంటుంది? ఆ స్థితిలో ఛాయాదేవి తన ప్రభను పూర్తిగా కోల్పోయింది. నిజానికి సినిమా రంగంలోకి వచ్చిన కొత్తలో ఆమె వెంట వచ్చిన వ్యక్తి, ఎస్వీ రంగారావు ప్రవేశంతో దూరం అయిపోయాడు. తర్వాత ఎస్వీ రంగారావు కాలం చేయడంతో ఆమెకు తోడుగా ఎవరూ లేని స్థితిలోకి వచ్చింది. చివరికి తన సొంత ఇంటిలో మూడో భాగానికే యజమానురాలని కోర్టు తీర్పుతో ఆమె జీవితం తలకిందులైంది. తను కష్టపడి సంపాదించిన పెద్ద మేడలో ఒక చిన్న గదికి పరిమితమై 1983 సెప్టెంబర్ 4న ఛాయాదేవి కన్ను మూసింది. తెరపై గయ్యాళిగా గర్జించిన ఛాయాదేవి నిజ జీవితం ఇలా దైన్యంగా ముగిసింది.
హెచ్ రమేష్ బాబు,
7780736386



