అవును !
ఏలికంతా అబద్ధమే
ఏలికలదంతా అబద్దమే
ఆ అబద్ధమే నేడు నచ్చుద్ది
అదే జనం మెచ్చేలా చేసుద్ది
చెప్పింది చేస్తే చర్చ ఎలా అవుద్ది
చేసింది చర్చకు రాకుండా ఉంటే
చరిత్రలో ఏం మిగులుద్ది
దోచిందల్లా దాచేస్తూ,
దాచిందంతా తోసేస్తూ
తెలియకుండా తెలిసినట్టు ఏకిస్తుంది
శూన్యంలో తిలకింపజేస్తూ
విశ్వాంతరాలకేగిస్తుంది
అరచేతిలో స్వర్గం
మరమ్మత్తులో మనం
దేని పరిధి దానికి
మండూక ప్రపంచం
ఈ మాత్రం పెకిలిస్తే తప్పేంటి
ఇదే శాశ్వతం అనకుంటే గతేంటి అతేంటి…
తోచిందే మాట్లాడాలి, నచ్చిందే చేయాలి
క్రిమి కీటకాలను సైతం చర్చకు తేవాలి
బొద్దింకలు, జలగలు, నల్లులు, పేనులు
ప్రచారం పెంచడానికి
ఎగదోసే మేనులుండగా …
లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు
పేలినా, బొంకినా, అరిచినా
ఆఖరికి చరచినా…
మొద్దు నిద్ర పుచ్చి
ఏలుతుంది అబద్దమే
ఏలిస్తుంది అబద్దమే
యుద్ధాలు చేయిస్తుంది అదే
యుగాలుగా నిలుస్తుంది అదే…
ఇప్పుడు సర్వం మిథ్యా, మిథ్యే మిథ్యా
మిథ్యే సర్వం
అంధత్వమున్నంతకాలం
అనంత యుగాలైనా
అబద్దానిదే పై చేయి, అబద్దానిదే ఏలుబడి
అబద్దానిదే ఆధిపత్యం
ఇదే ఇదే ఇదే ప్రస్తుత సత్యం
కారణం మనందరి అలసత్వం
– మహేష్ దుర్గే
అబద్ధపు ఆధిపత్యం
- Advertisement -
- Advertisement -



