పొంగులేటి కుమారుడికి చెన్నై కస్టమ్స్ శాఖ సమన్లు…!

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్ష రెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు సమన్లు పంపారు. కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ గడియారాల స్మగ్లింగ్ లో హర్ష రెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణలపై చెన్నై కస్టమ్స్ శాఖ ఈ సమన్లు జారీ చేసినట్టు సమాచారం. వాస్తవానికి ఏప్రిల్ 4న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని అధికారులు కోరగా, తాను డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నానని, ఇప్పుడు విచారణకు రాలేనని హర్ష రెడ్డి తెలిపినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నానని, ఏప్రిల్ 27 తర్వాత విచారణకు వస్తానని అతడు పేర్కొన్నట్టు ఆయా వర్గాలు తెలిపాయి. కాగా, ఈ వ్యవహారంపై హర్ష రెడ్డి జాతీయ మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఇది పూర్తిగా నిరాధారమైన అంశం అని, తనకు సమన్లు రావడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నాడు. ప్రస్తుతం తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని వెల్లడించాడు.

Spread the love