నేటితో ముగియనున్న ‘ధరణి’ ప్రత్యేక డ్రైవ్‌

నవతెలంగాణ హైదరాబాద్: ధరణి పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌ నేటితో ముగియనుంది. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ నెల 1న ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. గత నెల వరకు కలెక్టర్లకే పరిమితమైన పలు రకాల పరిష్కార బాధ్యతలను తహసీల్దార్లు, ఆర్డీవోలకు కూడా బదలాయించింది. దరఖాస్తుల సంఖ్యను బట్టి విచారణ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సైతం రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆ మేరకు మండల స్థాయిలో తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశారు.
నేటితో గడువు ముగిసినా స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతుందని రెవెన్యూవర్గాలు చెబుతున్నాయి. 2.46 లక్షల దరఖాస్తులకూ డెస్క్‌ వర్క్‌ (దస్త్రాలస్థాయిలో) పూర్తి చేశారని, విచారణ ప్రక్రియ మాత్రమే పెండింగ్‌ ఉందని పేర్కొంటున్నారు. డ్రైవ్‌ ఆఖరి గడువు తరువాత తదుపరి కార్యాచరణను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. డ్రైవ్‌ సందర్భంగా గుర్తించిన సాంకేతిక, క్షేత్రస్థాయి సమస్యలపైనా రెవెన్యూశాఖ సమీక్షిస్తే ఇంతకాలం పెండింగ్‌కు గల కారణాలు తెలుస్తాయని భూ చట్టాల నిపుణులు సూచిస్తున్నారు.

Spread the love