రాహూల్ సభలో ‘చెన్నూర్ సేవ్ – కాంగ్రెస్ సేవ్’ ప్లకార్డులతో ఆందోళన

– చెన్నూర్ టికెట్ సీపీఐ కేటాయిస్తే… కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్ధకం…!
– కరీంనగర్ రాహూల్ సభలో ప్లకార్డులతో నియోజకవర్గ నాయకుల ఆందోళన
నవతెలంగాణ-భీమారం :
చెన్నూర్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయిస్తోందన్న ప్రచారంతో నియోజకవర్గ నాయకులు, ప్రజల్లో సైతం ఆందోళన నెలకొంది. దీంతో గురువారం కరీంనగర్ సభకు వచ్చిన రాహూల్ గాంధీకి నియోజకవర్గ పార్టీ నాయకులు  ‘చెన్నూర్ సేవ్ – కాంగ్రెస్ సేవ్’ అంటూ ప్లకార్డులు పట్టుకొని రాహుల్ గాంధీని కోరుతూ సభలో నినాదాలు చేశారు. సభ అనంతరం రాహూల్ గాంధీ బస చేసిన హోటల్లో కలిసే ప్రయత్నం ఫలించలేదు. దీంతో నాయకులు మాట్లాడుతూ… చెన్నూర్ లో కాంగ్రెస్ పార్టీ బలమైన పట్టు సాధించిందని, భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆలాంటి స్థానాన్ని సీపీఐకి ఇస్తే రాబోయే రోజుల్లో పార్టీకి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. తద్వారా దీని ప్రభావంతో రానున్న పార్లమెంట్ ఎన్నికలపై కూడా ఉంటుందని తెలిపారు. నియోజకవర్గ మెజారిటీ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్న క్రమంలో చెన్నూర్ టికెట్  సీపీఐకి కేటాయిస్తే, ఆ పార్టీకి ఇక్కడ ప్రజల్లో అంతగా పట్టు లేకపోవడంతో చిత్తుగా ఓడిపోతుందని దీంతో టిఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా లబ్ధి జరిగే అవకాశం ఉందని గుర్తుచేశారు. ఒకవేళ అలా జరిగితే ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమై పార్టీ మనుగడకే ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గుడిమల్ల వెంకటేశం, దుర్గం లాజర్, రిక్కుల శ్రీనివాస రెడ్డి, పోటు రాంరెడ్డి, కొట్రాల మల్లన్న, లింగంపల్లి మహేష్, బీమ్ మధు, ఒడ్నాల శ్రీనివాస్, గోపతి రాజన్న, కడారి జాన్సన్, చంద్రగిరి ఎల్లన్న, సుధాకర్ తో పాటు భీమారం, కోటపల్లి, చెన్నూర్, జైపూర్, మందమర్రి నుంచి నాయకులు పాల్గొన్నారు.
Spread the love