నవతెలంగాణ – హైదరాబాద్ : దర్శక దిగ్గజం భారతీరాజా ఈ ఉదయం అనారోగ్య సమస్యలతో కన్నుమూయడంతో సినీ పరిశ్రమ షాక్ కు గురైంది. ఆయన మృతి పట్ల సినీ లోకం ఘనంగా నివాళులర్పిస్తోంది. ఈ క్రమంలోనే, భారతీరాజా దర్శకత్వంలో నటించిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అత్యంత భావోద్వేగ భరితమైన పోస్ట్ పెట్టారు. భారతీయ సినిమా ఈ రోజు ఒక గొప్ప కథకుడిని కోల్పోయింది అని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామీణ మట్టి సువాసనలను, మానవ సంబంధాల అందాలను, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను భారతీరాజా ఎప్పటికీ నిలిచిపోయే ఒక సినిమా కవిత్వంగా మార్చారని కొనియాడారు. ఆయన చిత్రాలు కోట్లాది మంది హృదయాలను తాకడమే కాకుండా, ఎన్నో తరాల సినీ దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాయని గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ హిట్ ‘ఆరాధన’ సినిమాలో ‘పులిరాజు’ అనే పాత్రలో నటించే అద్భుతమైన అదృష్టం తనకు దక్కిందని చిరంజీవి పేర్కొన్నారు.



