నవతెలంగాణ-హైదరాబాద్: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా చేశారు. ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ వారంలోనే టీఎంసీ నుంచి వైదొలగిన రెండో రాజ్యసభ సభ్యురాలు ఈమె కావడం గమనార్హం.రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు పంపిన తన రాజీనామా లేఖను తక్షణమే ఆమోదించాలని సుస్మితా దేవ్ కోరారు.
రాజీనామా చేసిన కొద్దిసేపటికే, ఆమె ఢిల్లీలో అసోం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మతో ఆయన నివాసంలో నవ్వుతూ కనిపించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇదే వారంలో సోమవారం నాడు, టీఎంసీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే, 58 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి, ప్రతిపక్ష నేత పదవికి అధికారిక అభ్యర్థిని కాదని వేరే వ్యక్తికి మద్దతు పలికారు. స్పీకర్ కూడా వారి నిర్ణయాన్నే మద్ధతు తెలపడంతో పార్టీలోని లోతైన విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇప్పుడు ఈ అసమ్మతి సెగ జాతీయ స్థాయికి పాకడంతో టీఎంసీ అధిష్టానం తీవ్ర ఆందోళనలో పడింది.



