మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి: సీఐటీయూ ధర్నా

నవతెలంగాణ – గుండాల
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గుండాల మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి విద్యా శాఖాధికారి కార్యాలయంలో మెసెంజర్ ఎవరూ లేనందున వినతి పత్రాన్ని గోడకు అంటించడం జరిగిందని స్థానిక మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి నజ్మ అన్నారు. శనివారం మండల కేంద్రంలో పొంబోయిన లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని, మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేలు వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. పెండింగ్ వేతనాలు సత్వరమే చెల్లించాలని, మెనూ చార్జీలు పెంచాలని, కోడి గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని. అదేవిధంగా రాగి జావ కాయడానికి గ్యాస్ సరఫరా చేయాలని చెప్పారు. మధ్యాహ్నం భోజన కార్మికుల డిమాండ్ల సాధనకు ఈ నెల 24న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. దానికి గాను సోమవారం పాఠశాలలో వంట చేయబోమని, పిల్లలకు ఇంటి నుంచి సద్ది తీసుకుని వచ్చేలా ప్రధానోపాధ్యాయులు పురమాయించాని కోరారు. ఈ కార్యక్రమంలో జయ, పాపమ్మ, మంగి, అచ్చి, బుల్లి, సోన, విజయ, భారతి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love