కార్మికవర్గ ఐక్యతకు సీఐటీయూ కృషి

To the unity of the working class CITU's efforts– ఢిల్లీలో ఘనంగా వ్యవస్థాపక దినోత్సవం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కార్మిక వర్గ ఐక్యత కోసం సీఐటీయూ అవిశ్రాంతంగా శ్రమించిందని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు కె. హేమలత పేర్కొన్నారు. సీఐటీయూ 54వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం సంఘం కేంద్ర కార్యాలయం (బీటీఆర్‌ భవన్‌)లో ఘనంగా వార్షికోత్సవాలు నిర్వహించారు. సీఐటీయూ జాతీయ అధ్యక్షులు కె. హేమలత జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తమ హక్కుల కోసం, ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సీఐటీయూ లక్ష్యాలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వేలాది మంది సీఐటీయూ సభ్యులు, లక్షలాది మంది సాధారణ సభ్యులకు అభినందనలు తెలిపారు. దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌, మతోన్మాద విధానాలను వేగంగా అమలు చేస్తున్న తరుణంలో సీఐటీయూ ఐక్య పోరాటాలను నిర్మించిందన్నారు. గత 54 ఏండ్లలో సీఐటీయూ ఐక్యత, పోరాటాల దిశగా ముందుకు వెళ్తుందన్నారు. కార్మిక వర్గ ఐక్యతను ముందుకు తీసుకెళ్లడం కోసం, ఈ సమాజంలో పెట్టుబడిదారీ దోపిడీని అంతం చేయడం కోసం శాశ్వత లక్ష్యం వైపు సీఐటీయూ పయనిస్తుందన్నారు. ఈ క్రమంలో అనేక ఆటంకాలు, అవరోధాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో వేలాది మంది కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో కూడా దేశంలో నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన పోరాటాలను ముందుకు తీసుకెళ్లడం కోసం సీఐటీయూ తన స్వతంత్ర కార్యాచరణను, మొత్తం కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే క్రమంలో ఐక్య పోరాటాలను కూడా ముందుకు తీసుకెళ్లడం కోసం తన కృషిని కొనసాగిస్తుందన్నారు. దేశంలో కులం, మతం, ప్రాంతం, జాతి పేరుతో ప్రజల మధ్య తీసుకొస్తున్న విభజన రాజకీయాలకు పాల్పడుతున్న మతోన్మాదుల పట్ల కార్మిక వర్గం అప్రమత్తంగా ఉండాలని, అలాగే కార్మిక వర్గాన్ని చైతన్యం చేసేందుకు సీఐటీయూ పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబా అధ్యక్ష వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు దేవరారు, జెఎస్‌ మజుందార్‌, ఎఆర్‌ సింధూ, ఆర్‌.కరుమలైయన్‌, ఎంఎల్‌ మల్కోటియ, హర్‌పాల్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ పాల్గొన్నారు.

Spread the love