పోరాటాల పురిటిగడ్డపై హోరాహోరి

On the battlefield Horahori– గతంలో కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ల కంచుకోట
– పూర్వ వైభవం కోసం వ్యూహాలు
– అసంతృప్తులతో గులాబీలో గుబులు
– ఎన్నికల్లో నువ్వా.. నేనా.. అనేలా ప్రచారం
పోరాటాల పురిటిగడ్డగా పేరొందిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికల హోరు నువ్వా.. నేనా అన్నట్టు ఉంది. ఆనాటి పోరాట పటిమ స్ఫూర్తిగానే వామపక్ష రాజకీయా లకు ఈ జిల్లా పెట్టని కోటగా నిలిచింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఎర్ర జెండాకే ప్రజలు పట్టం కట్టారు. ఆ తర్వాత వామపక్ష- టీడీపీ కూటమికి, ఆ తర్వాత కాంగ్రెస్‌కు అధిక స్థానాలు ఇచ్చి అండగా నిలవగా.. తెలంగాణ రాష్ట్రంలో అధిక స్థానాలు కట్టబెట్టి బీఆర్‌ఎస్‌ను ఆదరించారు. కాలానుగుణంగా ఎప్పటికప్పుడూ ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తున్నారు.
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఉమ్మడి జిల్లా ఆనాడు కమ్యూనిస్టులకు కంచుకోటగా నిలిచింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత ఈ గడ్డపై కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్నాయి. తదనంతరం కాంగ్రెస్‌ కూడా పుంజుకుంది. 1952లో జరిగిన తొలి సార్వత్రిక సంగ్రామంలో ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాలను కమ్యూనిస్టు పార్టీ (పీడీఎఫ్‌) కైవసంచేసుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా ఎర్రజెండా రెపరెపలాడింది. ఆ తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల మధ్య హోరాహోరీగా పోరు నడిచింది. రెండు పార్టీల మధ్యనే సై అంటే సై అనేలా సాగింది. టీడీపీ ఏర్పడిన తర్వాత వామపక్షాలు ఆ పార్టీతో జత కలిసి జిల్లాలో తమ సత్తాను చాటాయి. జిల్లాలో సగానికి పైగా స్థానాలు ఈ రెండు పార్టీలు కైవసం చేసుకున్నాయి. 1994లో టీడీపీ పొత్తులో భాగంగా వామపక్షాలు ఐదు స్థానాలు కైవసం చేసుకున్నాయి. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి సీపీఐ(ఎం), సీపీఐ చెరో రెండు స్థానాలు గెలుచుకున్నాయి. 2009లో మిర్యాలగూడ నుంచి సీపీఐ(ఎం), దేవరకొండ నుంచి సీపీఐ గెలుపొందింది. 2014లో దేవర కొండ నుంచి సీపీఐ అభ్యర్థి ఒక్కరే గెలుపొందారు.
విలక్షణ తీర్పు
రాష్ట్రవ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణలకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాలో కూడా రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొదటగా ఎర్ర జెండాకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం కాంగ్రెస్‌కు కూడా అంతే ప్రాతనిధ్యం ఇచ్చింది. ఆ తర్వాత టీడీపీకి అవకాశం కల్పించింది. మళ్లీ కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వగా, తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్‌, గులాబీల హవా నడిచింది. గత ఎన్నికల్లో 9 స్థానాల్లో గులాబీ జెండా ఎగరగా, మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ నిలిచింది. అందులో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
ఉప ఎన్నికల్లో ఆ స్థానం టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడింది. నకిరేకల్‌ నుంచి కాంగ్రెస్‌ తరపున గెలిచిన చిరుమర్తి లింగయ్య బీఆర్‌ఎస్‌లో చేరారు. మునుగోడులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి పదవికి రాజీనామా చేయగా.. జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ వామపక్షాల మద్దతుతో బీఆర్‌ఎస్‌ గెలిచింది. దాంతో ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాలు గులాబీ వశం అయ్యాయి.
పూర్వ వైభవం కోసం కాంగ్రెస్‌
గతంలో అత్యధిక స్థానాల్లో గెలుపొంది సత్తా చాటిన కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో చతికిలపడింది. 1999 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్‌ గెలిచింది. వామపక్షాల పొత్తుతో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ(ఎం) అత్యధిక స్థానాలు గెలుపొందాయి. భారీ మెజారిటీతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. 2009 ఎన్నికలో అత్యధిక స్థానాలను గెలిచి మళ్లీ అధికారం చేపట్టింది. 2014లో ప్రత్యేక రాష్టంలో జరిగిన ఎన్నికలో సైతం కాంగ్రెస్‌ 5 స్థానాలు గెలిచింది. 2018 ఎన్నికలో 3 స్థానాల్లో గెలువగా ఇద్దరు పార్టీ మారడం, ఒకరు రాజీనామా చేయడంతో జిల్లాలో కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేకుండా పోరయారు. ఇప్పుడు పూర్వ వైభవం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
పట్టు కోసం వ్యూహాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. కానీ అభ్య ర్థుల పట్ల స్థానికంగా వ్యతిరేకత వ్యక్త మవుతుండ టంతో ఆ పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. తిరిగి ఆ స్థానాలను నిలబెట్టుకు నేందుకు నానా తంటాలు పడుతున్నారు. ప్రధానంగా నల్లగొండ, నాగార్జునసాగర్‌, దేవరకొండ, నకిరేకల్‌, కోదాడ నియోజకవర్గాల్లో అధికార పార్టీకి అసంతృప్తుల వ్యవహారం తలనొప్పిగా మారింది. దాంతో ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీకి సీట్లు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Spread the love