అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు : సీఎం రేవంత్‌ రెడ్డి

Home sites for all deserving journalists: CM Revanth Reddyనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్తులందరికీ ఇంటి స్థలాలను ప్రభుత్వం సమకూరుస్తుందని ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్‌ సొసైటీ (జేఎన్‌జే)కి సంబంధించి ఇండ్ల స్థలాల అప్పగింతపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మెన్‌ కె.శ్రీనివాసరెడ్డితో జేఎన్‌జే ప్రతినిధులు చర్చించి ఒక రోడ్‌ మ్యాప్‌తో తన దగ్గరకు వస్తే ఒక్క నిమిషంలో సంబంధిత ఫైలుపై సంతకం చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలోని ఏ ఇతర సంస్థ కూ నామినేటెడ్‌ చైర్మెన్‌ను నియమించకుండా కేవలం మీడియా అకాడ మీకే శ్రీనివాస రెడ్డిని చైర్మెన్‌గా నియమించామంటే తమ ప్రభుత్వం జర్నలిస్టులకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టమవుతోందని అన్నారు. శుక్రవారం సాయంత్రం జేఎన్‌జేలో సభ్యులైన అన్ని పత్రికలు, టీవీ ఛానళ్లకు చెందిన ప్రధాన ప్రతినిధులు సచివాలయంలో ముఖ్య మంత్రిని కలిసి ఆ సొసైటీకి కేటాయించిన ఇండ్ల స్థలాల అప్పగింత ప్రక్రియను వంద రోజుల్లోగా మొదలుపెడతానన్న హమీని అమలు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Spread the love