నవతెలంగాణ -పరకాల: పరకాలలో ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పాల్గొనే సభకు పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఎం పర్యటన నేపథ్యంలో ప్రతిపాదిత హెలిప్యాడ్, సభా వేదిక, వాహనాల పార్కింగ్, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద సీఎం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్షించారు.
ప్రతిపాదిత హెలిప్యాడ్ కోసం లలితా కన్వెన్షన్ హాల్ సమీపంలోని స్థలాన్ని, సభా వేదిక, వాహనాల పార్కింగ్ కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అంగడి స్థలాలను పరిశీలించారు. సభకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ సీఎం పర్యటనలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హెలిప్యాడ్ నుంచి సీఎం ప్రయాణించే మార్గం, ఆసుపత్రి ప్రారంభోత్సవం, సభా వేదిక, ప్రజల రాకపోకలు, పార్కింగ్, రహదారులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ సీఎం భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ హెలిప్యాడ్, రూట్‌మ్యాప్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన భద్రతా ప్రణాళికను అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.అనంతరం సీఎం పర్యటనకు సంబంధించిన రూట్‌మ్యాప్, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ ప్రణాళికపై కలెక్టర్, పోలీస్ కమిషనర్ అధికారులతో సమీక్షించారు.ఈ కార్యక్రమంలో డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ రవి, డీఆర్డీవో మేన శ్రీను, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేష్‌బాబు, ఈఈ దేవిక, టీడబ్ల్యూఐడీసీ ఈఈ అరుణ్‌కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య, పరకాల మున్సిపల్ చైర్మన్ సునీల్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ పవన్, ఏసీపీ సతీష్‌బాబు, పరకాల సీఐ క్రాంతికుమార్, కౌన్సిలర్లు శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.



