సీఎం పొలిటికల్‌ టూర్‌

CM's political tour– లోక్‌ సభ అభ్యర్థులు, నామినేట్‌ పోస్టులపై అధిష్టానంతో చర్చలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాజకీయ, పరిపాలనాపరమైన అంశాలపై పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అధికారిక సమాచారం ప్రకారం… కాంగ్రెస్‌ జాతీయ నాయకులు రణదీప్‌ సుర్జేవాలా కూతురు వివాహానికి హాజరయ్యేందుకు రేవంత్‌ ఢిల్లీ ఫ్లైటెక్కారు. అనధికారిక సమాచారం ప్రకారం మాత్రం ఆయనది పక్కా పొలిటికల్‌ టూర్‌ అని తెలుస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసేందుకే సీఎం ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. రాష్ట్రానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు, ప్రస్తుత జెడ్పీ చైర్‌ పర్సన్లు హస్తం గూటికి చేరిన సంగతి విదితమే. త్వరలో జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో వీరి చేరిక తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. మరోవైపు లోక్‌సభ సీట్ల కోసం కాంగ్రెస్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లోని లోక్‌సభ స్థానాలకు ఒక్కో సీటు కోసం ఐదారుగురు పోటీ పడుతున్నారు. సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడం ద్వారా సీటు దక్కించుకునేందుకు నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీకి చెందిన పలువురు సీనియర్లు కూడా తమకు టికెట్‌ ఇస్తే కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీట్ల కేటాయింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకే రేవంత్‌ పీసీసీ అధ్యక్షుని హౌదాలో ఢిల్లీకి వెళ్లినట్టు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు పదేండ్ల పాటు పార్టీ అధికారానికి దూరంగా ఉన్నా… దాన్ని కాపాడుకుంటూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల గెలుపునకు తీవ్రంగా కృషి చేసిన నాయకులకు కార్పొరేషన్ల చైర్మెన్ల పదవులను ఇస్తామంటూ రేవంత్‌ హామీ ఇచ్చిన విషయం విదితమే. కష్టకాలంలో పార్టీని అంటబెట్టుకుని ఉన్న వారికి తగు రీతిలో గౌరవం కల్పించి, న్యాయం చేస్తామని ఆయన పలుమార్లు ప్రకటించారు. ఈ క్రమంలో అనేక మంది నాయకులు కార్పొరేషన్‌ చైర్మెన్‌ పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే వీరి సంఖ్య లెక్కకు మిక్కిలిగా ఉంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పదవులు దక్కని నేతలు అలిగే అవకాశముంది. లోక్‌సభ ఎన్నికల వేళ ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సీఎంపైన్నే ఉంది. అందువల్ల అత్యంత కీలకమైన ఈ అంశంపై కూడా అధిష్టానంతో చర్చించి జాతీయ స్థాయి నేతలను ఒప్పించి, మెప్పించి కార్పొరేషన్‌ పదవులపై ఒక క్లారిటీతో రావాలని ముఖ్యమంత్రి భావించారు. తన హస్తిన పర్యటనలో ఈ విషయంపై స్పష్టత వస్తుందని ఆయన తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. కాకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గానీ, గాంధీభవన్‌ నుంచి గానీ సీఎం పర్యటనపై ఎలాంటి వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవటం గమనార్హం.

Spread the love