బొగ్గుగనులను కోల్‌ ఇండియా, సింగరేణి సంస్థలకు అప్పగించాలి

– సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
నవతెలంగాణ-ఖమ్మం
దేశంలోని బొగ్గు గనులను ప్రయివేట్‌ కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం వేలం నిర్వహిస్తోందని, బొగ్గుగనులను కోల్‌ ఇండియా, సింగరేణి లాంటి ప్రభుత్వ సంస్థలకు అప్పగించి బలోపేతం చేయాలని సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్‌ చేశారు. శనివారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వదేశీ, మోదీ గ్యారెంటీ నినాదాలతో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం జాతీయ వనరులను, ఖనిజాలను, జాతి సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టే ప్రక్రియను వేగవంతంగా అమలు చేస్తోందని విమర్శించారు. దేశంలోని 500 బొగ్గు గనుల్లో ఇప్పటికే 300 బ్లాక్‌లను ప్క్రెవేట్‌ కార్పొరేట్‌ కంపెనీలకు దారాదత్తం చేసిందని ఆరోపించారు. శుక్రవారం నుంచి మరో 60 బొగ్గు గనులకు వేలం నిర్వహిస్తోందన్నారు. 140 ఏళ్ల చరిత్ర ఉండి.. ఎందరికో ఉపాధి కల్పించిన, ఏజెన్సీ అభివద్ధికి తోడ్పడిన సింగరేణి సంస్థను కాపాడటం చాలా అవసరమన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు మూడు ఈ వేలానికి, ప్క్రెవేటీకరణకు అనుకూలంగానే ఉన్నాయన్నారు. గనుల వేలంపై రాజకీయ పక్షాలు, కార్మికసంఘాలు నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, సీనియర్‌ నాయకులు గుర్రం అచ్చయ్య, జిల్లా నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, ఆవుల అశోక్‌, సీవై పుల్లయ్య, కమ్మకోమటి నాగేశ్వరరావు, బందెల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love