ఎమ్మెల్యే ఫిర్యాదుతో కదిలిన జిల్లా యంత్రాంగం..
22న హక్కు పత్రాలతో రావాలని బాధితులకు నోటీసులు
నవతెలంగాణ – పరకాల
పరకాల తహసీల్దార్ కార్యాలయంలో భూ మ్యూటేషన్ల వివాదం ఇప్పుడు జిల్లా యంత్రాంగం ముందుకు చేరింది. కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు మ్యూటేషన్లు జరిగాయన్న ఆరోపణలపై నవతెలంగాణ పత్రికలో వర్ష కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయికి ఫిర్యాదు చేయడంతో సమగ్ర విచారణకు జాయింట్ కలెక్టర్ రవిని ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో శనివారం జరిగే విచారణలో కోర్టు వివాదంలో ఉన్న భూములకు.. మ్యూటేషన్ ఎలా చేశారు అనేదే అసలు ప్రశ్న.
భూమిపై హక్కు వివాదం కోర్టులో ఉన్నప్పుడు రెవెన్యూ రికార్డులో పేరు ఎలా మారింది.? ఏ పత్రాల ఆధారంగా మ్యూటేషన్ జరిగింది.? కోర్టు కేసు విషయం అధికారుల దృష్టిలో ఉందా.? ఇవన్నీ విచారణలో తేలాల్సిన కీలక అంశాలు రికార్డులు మాయం అయ్యాయన్న అంశం కూడా ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం. గతంలో అధికారులే ఒక దశలో కొన్ని రికార్డులు లభ్యం కావడం లేదని వెల్లడించిన విషయం విధితమే. ఇప్పుడు అదే రికార్డులు ఎక్కడ ఉన్నాయి.? అవి ఎప్పుడు మాయమయ్యాయి.? తర్వాత లభించాయా.? రికార్డుల్లోని వివరాలు, ప్రస్తుతం ఉన్న పత్రాలు ఒకటేనా.? అన్నది కూడా విచారణలో స్పష్టమవ్వాల్సి ఉంది. ఎందుకంటే మ్యూటేషన్ వివాదంలో అసలు రికార్డులే కీలక సాక్ష్యం. రికార్డుల లభ్యతపై సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయకుండా విచారణ పూర్తయినట్లుగా భావించడం కష్టం.
22న రికార్డులతో హాజరు
ఈ నెల 22న బాధితులు తమ హక్కు పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పరకాల ఆర్డీవో కార్యాలయానికి రావాలని నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అయితే బాధితుల పత్రాల పరిశీలనతోనే విచారణ పూర్తికాదు. మ్యూటేషన్ ఫైళ్లు, రిజిస్ట్రేషన్ రికార్డులు, పహాణీలు, ఆర్‌ఓఆర్, పట్టాదారు పాస్‌బుక్‌లు, కోర్టు కేసుల వివరాలు, పాత రికార్డుల లభ్యత అన్నింటినీ పరస్పరం సరిపోల్చాలి.
ఇక రికార్డులే మాట్లాడాలి
ఇప్పటివరకు ఆరోపణలు, అనుమానాల చుట్టూ తిరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు అధికారిక విచారణ దశకు చేరింది. కోర్టు వివాదం ఉన్న భూమికి మ్యూటేషన్ జరిగిందా..? జరిగితే ఏ ఆధారంతో జరిగింది..? పాత రికార్డులు ఎక్కడికి వెళ్లాయి..? మ్యూటేషన్ ప్రక్రియలో నిబంధనలు పాటించారా..? ఈ ప్రశ్నలకు రికార్డుల ఆధారంగా సమాధానం రావాలి.



