మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై అధ్యయనానికి కమిటీ..

నవతెలంగాణ – హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కమిటీని నియమించింది. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ మాజీ చైర్మన్‌ జే చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. యూసీ విద్యార్థి, ఆర్‌ పాటిల్‌, శివకుమార్‌ శర్మ, రాహుల్‌ కుమార్‌ సింగ్‌ సభ్యులుగా నియమించగా.. ఎన్‌డీఎస్‌ఏ డైరెక్టర్‌ (టెక్నికల్‌) అమితాబ్‌ మీనా ఈ కమిటీకి మెంబర్‌ సెక్రెటరీగా వ్యవహరించనున్నారు. కమిటీ నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కమిటీకి సూచించింది. మేడిగడ్డ బరాజ్‌లో మూడు పిల్లర్లు నవంబర్‌లో కుంగిన విషయం తెలిసిందే. దానిపై కాంగ్రెస్‌ సర్కారు ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలంటూ ఫిబ్రవరి 13న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. మూడు బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణాలను నిపుణుల అధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Spread the love