రేప‌టి కామ్రేడ్లు

రేప‌టి కామ్రేడ్లు” ‘లాభం’ పద్ధతి అన్ని దేశాల్లోనూ తెలుస్తుందా?”
”తెలుస్తుంది గానీ, నూటికి ఒకరిద్దరికేలే. మిగతా 98 మందీ, ఇంకా తెలుసుకోవాలి!”
”లాభం కోసం కాకుండా, లాభాన్ని చేర్చకుండా, ‘ధర’ అనేది ఎప్పుడూ వుండదంటావా గోపాల్‌? వేలాది కంపెనీల వాళ్ళల్లో ఎందరో నిత్యం సరుకుల రాసుల్ని అమ్మిస్తూనే వుంటారు. వాళ్ళు ‘లాభం’ అనే మాట లేకుండా, ‘ధరల్ని’ నిర్ణయించరంటావా?”
”అప్పుడు అది, ‘పెట్టుబడిదార్లు కోరే ఉత్పత్తి విధానం’ ఎలా అవుతుంది? పెట్టుబడికి రావలిసింది, ‘కౌలూ – వడ్డీ – లాభం’ అనే మూడు ఆదాయాలు! తెలుసా? గుర్తుందా?”
”ఏదో చెప్పావు అప్పుడు. అప్పుడూ అడిగానుగా? ‘ఆదాయాలు’ వస్తే తప్పేమిటి? మనం కోపంగా ఏదో అనేస్తున్నామా?”
”చాల్లే! నోర్మూసుకో! తెలియకపోతే, ఇంకా అడుగు! ‘ఆదాయాలు’ అని ఒక మాటని పెట్టుకుంటే చాలా? అవి, ‘దోపిడీ’ చేస్తూ సంపాదించే దోపిడీ ఆదాయాలైతే? అయినా, ఆదాయాలేనా? ఒకడు, ”వడ్డీ, నా ఆదాయం!” అంటే చాలా? ఈ సమాజం అంతా, దోపిడీ ఆదాయాల కోసమే, దోపిడీదార్లు పెట్టుకున్న చట్టాల తోటే, వాళ్ళ పెత్తనాల తోటే, ‘ప్రభుత్వాల’ పేరుతోనే నడుస్తోందని తెలుసా?”
”నిజంగా క్షమించు! నాకు కొన్ని విషయాలు తెలుసు గానీ, నిజంగా నేను శ్రద్ధ లేకుండా మాట్లాడేశాను! ఇక, అన్నీ వింటాను. కానీ గోపాల్‌! ఉద్యోగాలే రావంటారు! ఇవ్వరంటారు! ఉద్యోగాలు ఎంత ఎక్కువ మందికి ఇస్తే, అన్ని ఎక్కువ లాభాలు వస్తాయని తెలీదా ఆ పెట్టుబడిదార్లకి?”
”అవును రవీ! మంచి ప్రశ్న! మంచి ప్రశ్నే! నేనూ ఇలా ఎప్పుడూ అనుకోలేదు! ఎక్కువ ఉద్యోగాలిస్తే, వాటి వల్ల ఎక్కువ లాభాలేగా వాళ్ళకి! మరి, ఉద్యోగాలెందుకివ్వరు? ఎందుకు తీసేస్తారు? ఒక్కడికే నలుగురైదుగురి పని ఎందుకు అప్పజెపుతారు? అయితే, ఈ ‘నిరుద్యోగం’ సమస్యేమిటి?వేల లక్షల మంది జనం, ఉద్యోగాలు లేకుండా ఎందుకు ఉంటున్నారు? ఆలోచించాలి మనం నిజంగా! అవును, ఎక్కువ మందికి ఉద్యోగాలిచ్చి ఎక్కువ లాభాలు ఎందుకు తీసుకోరు?”
గోపాల్‌ అలా అనడం రవికి విచిత్రంగా అనిపించింది. గోపాల్‌తో అన్నాడు. ”పెట్టుబడిగాళ్ళ
ఏడుపంతా లాభాల కోసమే కదా గోపాల్‌? లాభాలు తగ్గిపోయే లాగ వాళ్ళు చేసుకుంటారా? ఎందుకు
చేసుకుంటారు?చేసుకోరు కదా? నా కెలా అనిపిస్తోందంటే, ఎక్కువ మంది చేసే పనుల వల్ల వచ్చే లాభాల కన్నా, ఆ పనులన్నీ, తక్కువ మందితో చేయిస్తేనే ఎక్కువ పని జరుగుతుందనీ, ఎక్కువ లాభం వస్తుందనీ, అనుకుంటారేమో వాళ్ళు! అలా అనుకోకూడదంటావా మనం?”
గోపాల్‌ ఈ సారి ఆశ్చర్యపడి సంతోషంగా రవి చేతులు పట్టుకున్నాడు. ”రవీ! నీకు నేను క్షమాపణ చెప్పుకుంటా! క్షమించు! నిన్ను నోర్మూస్కో అనేశాను ఇందాక! అంత కోపం వచ్చింది, నువ్వు దోపిడీ ఆదాయాల్ని అర్ధం చేసుకోలేదని! అప్పుడు వెంటనే ఫీలయ్యాను! కోపం మరి! తప్పే నాది!”
”అయ్యయ్యో! ఏవిటింత పశ్చాత్తాపం? ఏవో విషయాలు మాట్లాడుకుంటూ ఎన్నో వంకరు టింకర్లుగా, ఒకళ్ళని ఒకళ్ళం ఏదో అనుకుంటూనే వుంటాం. దానికా ఇంత ఫీలింగ్‌? నేనైతే నిన్నే ఆ మాట అన్నా, అది తప్పనుకోను! సందర్భం అలాంటిదైతే అలాగే అంటాం. అది అంత తప్పా? సరే, క్షమించేశాలే! చాలా? తేలిగ్గా మాట్లాడు! నేనడిగిన దానికే చెప్పు! పెట్టుబడిగాళ్ళకి లాభాలే కావాలంటే, ఎక్కువ మందికి పనులిచ్చేసీ, ఎక్కువ లాభాలు సంపాదించుకోలేరా? అది చెప్పు! నాకు తెలిసే లాగ!
”చక్కగా ఆలోచిస్తావు. నువ్వే ఆలోచించు! నిజంగా పనులన్నీ ఒక్కొక్కళ్ళకే అప్పజెప్పేస్తూ వుంటారు. అస్తమానం, ‘టెక్నాలజీ, టెక్నాలజీ పెరగాలి!’ అంటారు. ఎంతసేపూ యంత్రాల తిరుగుళ్ళు పెరగాలి! రైళ్ళు చూడు, గంటకి ఇన్ని మైళ్ళు వెళ్తే, కాదు, అవి రెట్టింపుగా, మూడు రెట్లుగా తిరగాలి! ఒకళ్ళిద్దరు డ్రెవర్లతో నాలుగు రెట్ల పని జరిగిపో”వాలి! పని పెరగాలని చూస్తారు గానీ, పనులు చేసే వాళ్ళ గురించి ఉండదు. పెరిగిన పనికి ఎక్కువ విలువనే లెక్క కడతారు. పనులు పెంచినప్పుడు జీతాలు కొంచెం పెంచినా, నలుగురి ఉద్యోగాలు పోగొట్టే కదా? దాని వల్ల తేలేది, పాత లాభం పెరగడమే! నువ్వు ఎక్కౌంట్ల వాడివి! నీ లెక్కలతో, బూర్జువా తెలివిని చక్కగా లెక్క కట్టగలవు!”
”అవును! ఈ మధ్య కార్ల గురించి రకరకాల ఎడ్వర్లయిజ్‌”మెంట్లు! డ్రెవర్లు లేని కార్లట! చెయ్యాలంటే, అనేక మార్పులు సాధ్యమే, రెండో మూడో తప్ప! అలాంటి కార్లకి ఇంజన్లు తయారుచేసే గొప్ప ఇంజనీర్లకి జీతాల్లో నాలుగు వేలే కాదు, నలభై వేలు పెంచితే మాత్రం,డ్రెవర్లు లేని కార్లకే అమ్మకాలు. కోట్ల కోట్ల ఖరీదులతో అమ్మకాలు పెరిగితే, ఆ కొత్త కార్ల కంపెనీలకి ఎంత డబ్బు!”
”డబ్బు కాదు, లాభం!”
”అవును! లాభం అనాలి! ఒక టెక్నాలజీని, కనీసం ఇంత కన్నా పెంచకూడదు – అనే హద్దు ఉండదా? మనుషుల క్షేమాన్ని పెంచాలంటే, టెక్నాలజీని అనవసరంగా పెంచకూడదు; పెంచాలంటే క్షేమమే హద్దు కదా?”
”రవీ! నువ్వు అద్భుతంగా ఆలోచిస్తున్నావు. ఇంకా కూర్చుంటే, నీకు క్లాసు పోతుంది.”
”నిజమే గానీ, ఇవ్వాళ అదేదో రోత సినిమా రిలీజు. సగం మంది స్టూడెంట్లు వుండరు. టీచరూ రాక పోవచ్చు. ఆయన రేపు చెప్పేస్తాడు, ఆ సినిమాలో వీరత్వాల గురించి! ఇంకో అరగంట వుంటా గోపాల్‌! నీ క్లాసు వాళ్ళూ పోతారు. కాస్సేపు ఉండు!.”
”ఆలస్యంగా లేద్దాంలే. ఒక సంగతి చాలా సార్లు అనుకున్నాను. ఇప్పుడు ‘ఇళ్ళు’ చూడు! వాటిని ‘ఇళ్ళు’ అనగలమా? అపార్టుమెంట్లు! పైకి! పైకి! ఆకాశంలోకి వెళ్ళడమా ఇల్లు అంటే? అక్కడ ఒక్క చెట్టూ కనపడదు! పిల్లలు ఇంట్లో, వాకిళ్ళల్లో ఆడుకోవడం వుండదు! పార్కుల్లోకి తీసుకెళ్ళవలి సిందే! నేల మీద ఇళ్ళకి చోటు లేదంటారు!…..”
”అదే కారణం అయితే, నాలుగైదు అంతస్తుల ఎత్తు వరకూ మాత్రమే చాలా విశాలంగా వుండవచ్చు కదా?”
”నువ్వు ఐదు అంతస్తుల దాకా వెళ్ళావు రవీ! నాకైతే రెండో మూడో దాటితే అసహ్యమే. ఒక డాక్టరెవరో, తోటలో వుండే ఇంటిని అమ్మేసి, కొన్న వాళ్ళెవరో మరి! వాళ్ళకి నేల ఇల్లు ఎలా పనికొచ్చిందో!”
”ఆ తోట ఇల్లు అమ్మేసినాయన ఎక్కడ కొన్నాడు?”
”ఇంకెక్కడీ 93 అంతస్తుల చోట, 92వ చోట!”
”ఛీ! అన్ని అంతస్తులున్నదాన్ని ఇల్లు అంటారా?”
”ఇది పెట్టుబడిదారీ నాగరికత! ఈ పద్ధతిని ఏమన్నా అంటే, బూర్జువాలు ఏవంటున్నారో తెలుసా? అపార్టుమెంట్లయితే నిరుపేదలకి కూడా ఇళ్ళు వుంటాయట! అది ఇష్టం లేక మన లాంటి వాళ్ళు, వాళ్ళకి పాకలే గుడిసెలే, వుండాలి – అంటున్నామట!”
”ఆ గుడిసెల వాళ్ళేమంటున్నారు?”
”ఆకాశంలో కోళ్ళ బుట్టల్లాంటి అపార్టుమెం టుల్లో వుంటూ, ‘ధనవంతులం అయిపోయాం’ అనుకుంటున్నట్టే వున్నారు!” అని ఆపాడు గోపాల్‌ నిరుత్సాహంగా.
”నిరుపేదలు అంత కన్నా ఎలా అనగలరు? వాళ్ళకి కొంచెం మార్పులాగే వుంటుంది కదా? ఇక, బూర్జువా సైన్సు ఇలా నేర్పుతుంది కాబోలు! సమాజానికి ఇది, ఎదుగుదలగా అవుతుందా?”
”కాదు, ఇది ఇంకో రకపు కొత్త శ్రమ దోపిడీ! లాభాలు సంపాదించడానికి కొత్త మార్గం. తక్కువ చోట్లో ఎక్కువ ఇళ్ళు!”
”సమాజంలో శ్రమ దోపిడీలు జరుగుతోంటే, వాటిని సహిస్తూ పడి వుంటే, అది పూర్వ కాలం నించీనా ఈ ఘోరం?”
”అంతే! మరీ ఐదో తరగతి పిల్లాడి లాగ ఏదీ తెలియనట్టు కొత్తగా మాట్లాడుతున్నావేమిటి? డిగ్రీ లు సాధిస్తున్నావు! వాటి వల్ల తెలివే రాదా? ఈ సమాజం, వేల వేల సంవత్సరాల క్రితమే బానిస యజమానుల ఘోరాల కింద ప్రారంభమైంది. అది, భూస్వామ్య విధానంతో కొంత ఎదిగింది! అది కూడా పెట్టుబడిదారీ విధానంగా మరి కొంత ఎదిగి నట్టే! ఇక ఈ మొత్తం దోపిడీల నించి విముక్తి కావాలి!”
(ఇంకావుంది)
– రంగనాయ‌క‌మ్మ‌

Spread the love